‘త్వరలో నిజాలు బయటకు వస్తాయి’
‘అమాయక ప్రాణాలతో ఆటలొద్దు. ప్రతీకారం తీర్చుకోవాలంటే నేను ఇంట్లో లేదా ఆఫీసులో అందుబాటులో ఉంటా’ - తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశించి TVK చీఫ్ విజయ్
తమిళనాడు(Tamil Nadu) కరూర్‌లో తమిళగ వెట్రీ కజగం (TVK) విజయ్(Vijay,) ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా సుమారు 60కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విజయ్ మంగళవారం (సెప్టెంబర్ 30) మాట్లాడారు. ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ట్రెండ్ అవుతోంది.
జీవితంలో మరిచిపోలేని ఘటన..
‘కరూర్ ఘటన నా రాజకీయ జీవితంలో అత్యంత విషాదకరమైనది. బాధాకరమైనది కూడా. మృతుల కుటుంబాలకు నా సంతాపం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రచార సమయంలో నన్ను చూడడానికి ఆప్యాయతతో వచ్చిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ర్యాలీ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వేదికకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చారు. కాని జరిగిన ఘటన దురదృష్టకరం. నేను కూడా మనిషినే. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించాలని ఉంది. కరూర్‌కు రావాలని ఉంది. కాని నా రాకతో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉండడంతో భయపడుతున్నా. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.
స్టాలిన్‌పై విరుచుకుపడ్డ విజయ్..
‘‘నా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. నామీద ప్రతీకారం తీర్చుకోండి. జనం మీద కాదు. నేను ఇంట్లో లేదా నా కార్యాలయంలో అందుబాటులో ఉంటా. ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో ప్రచారం నిర్వహించాం. ఎక్కడా ఎలాంటి దుర్ఘటన చోటుచేసుకోలేదు. కాని కరూర్‌లో ఈ విషాదం ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. సుభిక్ష ప్రజానీకం కోసం నా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తా. బాధితుల బాధను అర్థం చేసుకుని సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీల నాయకులకు నా కృతజ్ఞతలు.’’ అని ముగించారు విజయ్.