ఎక్స్ ట్రాడిషన్ ఒప్పందాలు ఉన్న ప్రభాకర్ రావును అప్పగిస్తారా?

ముంబై ఉగ్రదాడుల నిందితుడిపై ఏళ్లుగా కోర్టుల్లో కొనసాగుతున్నవాదనలు;

Update: 2025-01-20 09:08 GMT

గత ప్రభుత్వం హయాంలో పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన కేసులో కీలక నిందితుడు మాజీ తెలంగాణ స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ టి. ప్రభాకర్ రావును, పరారీలో ఉన్న శ్రవణ్ రావును దేశంలోకి తీసుకురావడానికి ‘నేరస్థుల అప్పగింత’ ఒప్పందాన్ని వాడుకోవాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఓ నోట్ ను కేంద్ర హోంశాఖను పంపాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నోట్ కేంద్ర హోంశాఖ నుంచి ఇది విదేశాంగ శాఖకు తరువాత అమెరికాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు అమెరికాలో ఉంటున్నారని సమాచారం.

ఏమిటీ ఆ ఒప్పందం..
యూఎస్ఏ- భారత ప్రభుత్వం జూన్ 25, 1997న నేరస్థుల అప్పగింత ఒప్పందం పై సంతకం చేశాయి. దీని ప్రకారం ఇరుదేశాల్లో నేరాలు చేసి పారిపోయిన వ్యక్తులు గనక రెండు దేశాల్లో ఆశ్రయం పొందితే ఈ ఒప్పందం ప్రకారం వారిని పరస్పరం అప్పగించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. వ్యక్తులు పాల్పడిన నేరం ఆయా దేశాల చట్టాల ప్రకారం ఒక సంవత్సరం పైన జైలు శిక్ష పడే అవకాశం ఉండే నేరస్థుల విషయంలో ఈ ఒప్పందం అమలు చేయాలి.
అయితే రాజకీయ ఆశ్రయం పొందిన వ్యక్తుల విషయంలో ఇది మాత్రం వర్తించదని ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే అమెరికా కోర్టుల్లో ఏదైన నేరం చేసిన వ్యక్తికి అప్పగించే విషయంలో కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఒప్పందంలో రాసుకున్నారు.
సక్రమంగా అమలవుతుందా?
అమెరికాతో సహ చాలా దేశాలతో భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందం పై సంతకాలు చేసింది. అయితే వాటి అమలు విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిందితులు స్థానిక కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిరంతరం ఆలస్యం అవుతోంది.
భారత్ లో 26/11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు సాయం చేసిన తహవ్వుర్ రాణా అప్పగింత విషయంలో దాదాపు 5 సంవత్సరాలుగా కేసు నడుస్తూ ఉంది. దాడి జరిగిన సంవత్సరం నుంచి తీసుకుంటే దాదాపు 17 సంవత్సరాలుగా నిందితుడు రాణా అమెరికా, కెనడాలో స్వేచ్చగా సంచరించాడు.
చివరకు భారత్ గట్టిగా ఒత్తిడి చేయడంతో 2020 లో అమెరికా అతడిని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కేసు కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా కొన్ని రోజుల క్రితం కోర్టు నిందితుడిని అప్పగించడానికి చివరి వాదనలు వింది.
ముంబై పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 160 మందిని పొట్టనపెట్టుకున్న కేసులో పాకిస్తాన్ సంతతి బిజినెస్ తహవ్వూర్ రాణా కీలకంగా వ్యవహరించాడని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మరో పాక్ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ సాయంతో వీడియోలు తీసి వాటిని పాక్ లోని ఉగ్రవాద బృందాలకు అప్పగించడంలో వీరే కీలకంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలింది.
హెడ్లీని విచారించిన భారత దర్యాప్తు సంస్థలు ఇంకా రాణా విషయంలో ఎదురు చూస్తునే ఉన్నాయి. అతడిని విచారిస్తే గాని పాక్ ఉగ్రవాదుల విషయంలో ఓ స్పష్టత రాలేము. కానీ నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రాణాను ఇండియాకు తీసుకురావడంతో జాప్యం జరుగుతూనే ఉంది. అలాగే కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ విషయంలో కూడా ఈ ఒప్పందాలు ఉన్న ఏళ్లకు ఏళ్లు విచారణ చేస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు టీ. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను తీసుకురావడానికి తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియదు. పైగా ప్రభాకర్ రావు కేసు నమోదు కావడానికి చాలా రోజుల ముందే అమెరికా వెళ్లిపోయాడు.
అంతకుముందు కూడా అనేక సార్లు వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లాడు. తరువాత బంధువుల సాయంతో గ్రీన్ కార్డు సైతం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆయన విషయంలో పరారీలో ఉన్న నిందితుడనే నిబంధనలు వర్తించకపోవచ్చు.
శ్రవణ్ రావు విషయంలో మాత్రం ఇవి పనిచేసే అవకాశం ఉంది. అయితే నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని తీసుకుని వారిని తీసుకురావడం మాత్రం ఓ ఏడాదో, రెండు సంవత్సరాల్లో మాత్రం సాధ్యం కాదని గత పరిణామాలు నిరూపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే..
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యం ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ ను చేయడమే అనిపిస్తోంది. అందుకే ప్రతి నెల రోజులకు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసును కదిలిస్తూ జనం మెదళ్లలో ఆ కేసు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పరిణామంతోనే బీఆర్ఎస్ కు సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదని విషయం మనం గుర్తుంచుకోవాలి.
ఇలా దీన్ని అలాగే సజీవంగా ఉంచి రాజకీయంగా మైలేజ్ పొందాలనే లక్ష్యం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. ఈ అంశం అధికార పార్టీకి లీవరేజీగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తరువాత జరిగిన ఫార్మూలా ఈ రేస్ వ్యవహారం అనుకున్నంత మైలేజ్ రాలేదు.
అవినీతి జరిగిందనే దాని బదులు నిబంధల ఉల్లంఘనే జరిగిందని విషయాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అలాగే తదుపరి తమపై ప్రభుత్వం ఓఆర్ఆర్ కేసు పెట్టబోతోందని కూడా చెప్పేశారు. దాన్ని బ్రేక్ చేయడానికే ప్రభుత్వం మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు నెట్టినట్లు కనిపిస్తోంది.
హమీల అమలులో క్షేత్ర స్థాయిలో వైఫల్యం కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దాన్ని డైవర్ట్ చేయాలన్న ఏదో విషయం అధికారంలో ఉన్నవారికి అవసరం. అందుకే ఈ కేసుల విషయాన్ని హైలైట్ చేయాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ వాదన. అందుకే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని అంటున్నారు. ఏదిఏమైన ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం ముందుకు తెచ్చిన నేరస్థుల అప్పగింత ఒప్పందం తో నిందితులు మాత్రం ఇప్పట్లో భారత్ కు రాలేరని స్ఫష్టం.


Tags:    

Similar News