భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌ల ఉత్పత్తి
హైదరాబాద్‌లో రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూజ్‌లేజ్‌ల ఉత్పత్తి 2028వ సంవత్సరంలో ప్రారంభం కానుంది.;
By : Shaik Saleem
Update: 2025-06-05 12:41 GMT
దేశ రక్షణ కోసం రాఫెల్ ఫైటర్ యుద్ధ విమానాల తయారీకి హైదరాబాద్ నగరం కేంద్రం కానుందా అంటే అవునంటోంది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ.భారతదేశంలో రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూజ్‌లేజ్‌లను తయారు చేసే కర్మాగారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారతదేశంలో రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూజ్‌లేజ్‌లను హైదరాబాద్ లో తయారు చేయడానికి ఉత్పత్తి బదిలీ ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ వ్యూహాత్మక సహకారం భారతదేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాల్లో కీలకమైన పురోగతిని సూచిస్తుంది.
2028 కల్లా ఉత్పత్తి ప్రారంభం
రాఫెల్ యుద్ధ విమానంలో కీలకమైన నిర్మాణ భాగాలైన షెల్స్, ఫ్యూజ్లెజ్, సెంట్రల్ ఫ్యూజ్‌లేజ్, ముందు విభాగాలను హైదరాబాద్‌లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉత్పత్తి చేయనుంది.నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్ ల చొప్పున 2028వ సంవత్సరం నుంచి ఉత్తత్తి చేయాలని నిర్ణయించారు. మొట్టమొదటిసారి ఫ్రాన్స్ దేశం వెలుపల హైదరాబాద్ నగరంలో రాఫెల్ ఫ్యూజ్ లెజ్ లను ఉత్పత్తి చేయనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ విస్తరణకు దోహదం చేస్తుందని డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ చెప్పారు.
కీలక ముందడుగు
హైదరాబాద్ నగరంలో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ప్రారంభించడం రక్షణ రంగ విమానాల ఉత్పత్తిలో కీలక ముందడుగు అని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, ఎండీ సుకరణ్ సింగ్ చెప్పారు. డస్సాల్ట్ ఏవియేషన్ సహకారంతో భారతదేశంలో పూర్తి రాఫెల్ ఫ్యూజ్‌లేజ్ ఉత్పత్తిని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చేపడుతుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం వల్ల భారతదేశంలోని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్బర్ చొరవతో చేపడుతున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కీలకమైన విడిభాగాల ఉత్పత్తి ద్వారా ఏరో స్పేస్ తయారీ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించనుందని ఆయన వివరించారు.