నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్
పతంగుల పండుగలో ఈ సారి 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, 14 రాష్ర్టాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు పాల్గొంటున్నారు.;
సంక్రాంతి వచ్చిందంటే.. ఇళ్ల ముందు గొబ్బెమ్మల ముగ్గులు.. మేళగాళ్లతో డుడూ బసవన్నల సందడి..కోడి పందెలు..ఇంకా ఎన్నో..చిన్నా, పెద్ద తేడా లేకుండా.. చాలా జోష్‌గా పంతగులను ఎగరేసే పండుగ. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కైట్ ఫ్లయింగ్ ఓ కలర్‌ఫుల్ ఈవెంట్. అక్కడ ప్రత్యేకంగా పతంగుల కోసమే ఓ మ్యూజియం ఉంది. వివిధ ఆకారాల్లో వందల సంఖ్యలో తయారుచేసిన గాలిపటాలు అందులో కనిపిస్తాయి. గార్బా నృత్యాన్ని ప్రతిబింబించే 16 అడుగుల గాలిపటం స్పెషల్ అట్రాక్షన్.. ఈ కైట్ ఫెస్టివల్‌ను వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఇక హైదరాబాద్‌లో ఏటా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు..
కైట్ ఫెస్టివల్‌తోపాటు స్వీట్ ఫెస్టివల్
సంక్రాంతిని పురస్కరించుకుని నేటి నుంచి సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్(Parade ground)లో కైట్ ఫెస్టివల్ (Kite ఫెస్టివల్) ప్రారంభం కానుంది. కైట్ ఫెస్టివల్‌తోపాటు స్వీట్ ఫెస్టివల్‌ను కూడా తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. 50 దేశాల నుంచి 120 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, 14 రాష్ర్టాల నుంచి 60 దేశవాళీ కైట్ క్లబ్ సభ్యులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. బేగంపేట హరితప్లాజాలో ఏర్పాటు చేసిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పోస్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. పండుగలు, ఆట పాటలు, ముగ్గులు, పతంగులు ఎగరేయడం సంస్కృతిలో భాగమన్నారు. గ్రామాలకు కూడా దీన్ని విస్తరించాలని కోరారు. కైట్ ఫెస్టివల్‌లో నగరవాసులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎప్పట్నుంచి..
తెలంగాణ కైట్ ఫెస్టివల్ 2016లో మొదలైంది. ఏటా జనవరి 13, 14, 15 తేదీల్లో మూడురోజుల పాటు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజులు గాలిపటాల ఎగురవేత ప్రధాన ఆకర్షణ. మూడో రోజు సంగీతం, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో ఫెస్టివల్ ముగుస్తుంది.
జనవరిలోనే ఎందుకు..
జనవరిలో గాలిపటాలు ఎగురవేయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గాలిలో తేమ, పొడి శాతం తక్కువగా ఉండడం వల్ల పతంగులు నిలకడగా ఎగురుతాయి.
హైదరాబాద్‌కు పతంగులకు అవినాభావ సంబంధం..
ఇక హైదరాబాద్(Hyderabad)లో 400 ఏళ్ల క్రితం ఈ సంస్కతి మొదలైంది. ఇబ్రహీం కులీకుతుబ్ షా గోల్కొండ కోటలో ఈ పండుగను అధికారికంగా నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు తెచ్చారు. మైదానాల్లో పతంగులు ఎగురవేయించి, ఎక్కువ పతంగులు పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చే వారు. 1925వరకు పాతబస్తీలో ఏటా ఈ పండుగ నిర్వహించారు. అందుకే ఇక్కడ కొంతమంది పతంగుల తయారీని తమ ఉపాధిగా మలుచుకున్నారు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో..
దేశంలోని అన్ని ప్రాంతాలలో సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. సబర్మతి నది తీరంలో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. అహ్మదాబాద్‌లో గాలిపటాల చరిత్రను వివరించే మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 400 రకాల పేపర్లతో తయారుచేసిన గాలిపటాలను భద్రపరిచారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లోనూ ప్యాలస్‌లు, కోటలను గాలిపటాలతో ఆలంకరిస్తారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు.
వినోదంగా మొదలై సంస్కతిలో భాగమై..
వాస్తవానికి గాలిపటాలు ఎగరించడం ఒక వినోదంగా ప్రారంభమైంది. రాజులు, నవాబులు తమ శక్తి, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి గాలిపటాలను ఎగరేసేవారు. ఆ తరువాత సామాన్యులూ ఎగరేయడం ప్రారంభించారు. మొత్తంగా గాలిపటాల పండుగ భారతీయ సంస్కృతిలో ఒక భాగం అని చెప్పొచ్చు.
ఎన్ని లాభాలో..
పతంగులను కేవలం వినోదానికి మాత్రమే ఎగురవేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి.
- గాలిపటాలను ఎగరేసేటపుడు మన శరీరంపై సూర్యకిరణాలు పడతాయి. దీని వల్ల విటమిన్ డి (Vitamin D) లభించి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
- ఎండలో ఉండడం వల్ల మనసుకు వెచ్చని ఆహ్లాదం.
- గాలిపటం దారాన్ని పట్టుకొని అటు ఇటు కదలడం, పరుగెత్తడం వల్ల కేలరీలు కరుగుతాయి.
- హార్ట్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
- మనుషుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని చెప్పొచ్చు.
- కుటుంబాలు, మిత్రులు కలిసి గాలిపటాలను ఎగరేయడం వల్ల ఆనందాన్ని పంచుకుంటారు.
- అన్ని వర్గాల ప్రజలను ఒక్కతాటి మీదకు తీసుకువస్తుంది.
- ప్రజల సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది.
- ప్రకృతిని ఆహ్వానించడం ప్రధాన ఉద్దేశం.
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పిల్లలు ఎక్కువగా గాలిపటాలు ఎగురవేయడానికి ఆసక్తి చూపడం లేదు. గాలిపటాలు ఎగురువేయడం వల్ల కలిగే లాభాలను పిల్లలకు వివరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
పతంగుల విక్రయ కేంద్రాలు..
చార్మినార్, ధూల్ పేట్, లాల్ బజార్, బేగంపేట ప్రాంతాలు పతంగుల అమ్మకాలకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు హోల్‌సేల్‌గా పతంగులను కొని తీసుకెళ్తుంటారు. సంక్రాంతికి నెల ముందు నుంచే ఇక్కడ వ్యాపారం ఊపందుకుంటుంది.
గాలిపటాల చరిత్ర..
పతంగులను ఎగరేయడం క్రీస్తు పూర్వం 2వేల ఏళ్ల కిందే చైనాలో మొదలైందట. చైనా బార్డర్‌లో ఉన్న సైనికులు పతంగులకు బాంబులు కట్టి శత్రు స్థావరాలపై పడేలా ఎగుర వేసేవారు. ఐదో దశాబ్దంలో ఇండోనేషియాలో చెట్ల ఆకులతో తయారుచేసిన గాలిపటాలు ఎగురవేసేవారు. 14వ శతాబ్ధంలో మనదేశంలోని ప్రవేశించాయి. ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మోజీ మొదట ఈ గాలిపటాన్ని పట్టువస్త్రంతో తయారు చేశారట. ఆ తర్వాత హేన్ చక్రవర్తి శత్రువు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో పతంగి తయారుచేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి, సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని కొందరు చెబుతుంటారు.