పెట్రేగిపోతున్న వీధికుక్కలు..నియంత్రణ చర్యలేవన్న హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రేగిపోతున్న వీధికుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయి.వీటి నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-07-03 10:08 GMT

తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధికుక్కల దాడులు పునరావృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం సీరియస్‌గా స్పందించింది. వీధికుక్కల బెడద కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం ఏం చేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.

వీధి కుక్కల నివారణకు చర్యలేవి? : ప్రశ్నించిన హైకోర్టు
వీధికుక్కల నివారణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వారం రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలని మున్సిపల్, రెవెన్యూ, వెటర్నరీ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి క్లిష్టంగా ఉందని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు నొక్కి చెప్పారు.

ఆగని వీధికుక్కల దాడులు
హైదరాబాద్ నగరంలో వర్షాకాలం మొదలై వానలు కురుస్తున్న వీధి కుక్కల దాడులు మాత్రం ఆగటం లేదు.వరుసగా సాగుతున్న వీధికుక్కల దాడులతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వీధి కుక్కల బెడదపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.పటాన్‌చెరులో ఆరేళ్ల బాలుడిని వీధికుక్కలు కొరికి చంపాయి. ఈ కేసును హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందనను హైకోర్టు నిశితంగా పరిశీలిస్తోంది.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం : జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ సీనియర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వీధికుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని పట్టుకొని ఆపరేషన్లు చేసి, వ్యాక్సిన్ అందించి వదిలివేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

వరుసగా వీధి కుక్కల దాడులు
- జులై 3: సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఆరు వీధికుక్కలు దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.గాయాల పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు. వీధిలో కుక్కల దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
- జూన్ 29 : పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో వీధికుక్కలు ఏఢు నెలల పసికందుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కుక్కల కాటుకు తీవ్రంగా గాయపడిన పసికందును నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
- జూన్ 28: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మహీధర వెంచరులో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. బాలుడు ఆడుకుంటుండగా వీధికుక్కలు వచ్చిన దాడి చేశాయి. వీధికుక్కల దాడిలో బాలుడు రక్తపుమడుగులో మృత్యువాత పడ్డాడు.
- జూన్ 23: నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో వీధి కుక్కలు రోడ్డుపై నడచి వెళుతున్న ఓ వృద్ధురాలిపై దాడి చేశాయి. వృద్ధురాలు పరుగెత్తడంతో ప్రమాదం తప్పింది.
- జూన్ 21: నిర్మల్ పట్టణంలోని గాజుల పేట ప్రాంతంలో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. కుక్కకాటుతో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుక్కకాటు బాధితులకు పరిహారం సరిపోదు: హైకోర్టు సీజే
కుక్కకాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించడం మాత్రమే సరిపోదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఉద్ఘాటించారు.పటాన్‌చెరులో ఇటీవల జరిగిన ఈ సంఘటనలో 6 ఏళ్ల బాలుడిని వీధికుక్కల గుంపు కొరికిచంపింది, ఫిబ్రవరి 19, 2023న హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లోని యెరుక్కల బస్తీలో గత ఏడాది ఫిబ్రవరి 19వతేదీన ఆరేళ్ల బాలుడిని వీధికుక్కలు దాడి చేసి చంపాయి.


Tags:    

Similar News