కొత్తగూడెంలో ఢిల్లీ తరహా ఘటన,యువతిని చంపి...20 ముక్కలు చేసి...
ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా అనే అమ్మాయిని ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపి 35 ముక్కలు చేసిన ఘటనను పోలిన మరో దారుణం తెలంగాణలో బుధవారం వెలుగుచూసింది.
By : Shaik Saleem
Update: 2024-11-13 11:14 GMT
ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్ధా అనే అమ్మాయిని ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపి 35 ముక్కలు చేసిన ఘటనను పోలిన మరో దారుణం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. ఢిల్లీ తరహా దారుణ ఘటన కొత్తగూడెంలో జరగడం సంచలనం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్వాతి కోసం వెతుకుతున్న పోలీసులకు ఓ రైతు నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో ఓ యువతి మృతదేహం 20 ముక్కలుగా కనిపించింది.ఆ ముక్కలను చూడగా మృతదేహం అదృశ్యమైన స్వాతిదిగా పోలీసులు గుర్తించారు. స్వాతి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె ప్రియుడైన వీరభద్రం ఈ హత్య చేశాడని తేలింది.
ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి...
సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి జూలూరుపాడు మండలానికి చెందిన రత్నకుమార్, పార్వతి దంపతుల వద్ద నుంచి వీరభద్రం, స్వాతి కలిసి రూ.16 లక్షలు తీసుకున్నారు. వీరభద్రం, స్వాతిలు డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పించక పోవడంతో నెలానెలా వడ్డీ పెరగడంతో ఆవేదనతో రత్నకుమార్, పార్వతి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తాము తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తామని స్వాతి రత్నకుమార్ కుటుంబానికి హామి ఇచ్చింది. ఈ డబ్బు విషయమై స్వాతి, ఆమె ప్రియుడు వీరభద్రంల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. డబ్బు విషయమై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయంతో వీరభద్రం స్వాతిని హతమార్చి ఎవరూ గుర్తు పట్టకుండా 20 ముక్కలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
బస్తాలో స్వాతి మృతదేహం ముక్కలు లభ్యం
వీరభద్రం తన ప్రియురాలైన స్వాతిని చంపి, 20 ముక్కలుగా కోసి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడని తేలింది.డబ్బు విషయంలో గొడవ పడిన వీరభద్రం తన ప్రియురాలైన స్వాతిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని దారుణంగా హత్య చేశాడని భద్రాద్రి పోలీసులు చెప్పారు.