చలికాలం ప్రారంభంలో అసాధారణ ఉష్ణోగ్రత మార్పులు..IMD అంచనా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం గందరగోళం... పగలు చల్లగా, రాత్రులు వేడిగా మారనున్నాయ్!

Update: 2025-11-01 09:22 GMT
చలికాలం ఆరంభంలో పగలు వణికించే చలి

పగటి పూట చల్లని గాలులు... రాత్రివేళల్లో వెచ్చని ఉష్ణోగ్రతలు... ఈ ఏడాది నవంబర్‌ నెలలో భారత వాతావరణం తన సహజ స్వరూపం మార్చబోతోంది. వాతావరణశాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ మార్పులు సంభవించనున్నాయి.పగలు చల్లగా, రాత్రులు వెచ్చగా మారబోతున్న ఈ అసాధారణ మార్పు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.చలి కాలం ఆరంభమయ్యే ఈ నెలలో వాతావరణం కొత్త రూపం దాల్చబోతోందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.



వాతావరణంలో అనూహ్య మార్పులు...
2025 నవంబర్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు శనివారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ నవంబర్ నెలలో పగలు చలిగాలులు, రాత్రివేళల్లో వెచ్చదనం ఉంటుందని ఆయన వెల్లడించారు. దేశంలో ఈ చలి కాలంలో ఊహించని వాతావరణ మార్పులు కనిపిస్తాయని ఆయన తెలిపారు. భారతదేశంలో నవంబర్ నెలలో స్పష్టమైన వాతావరణ మార్పును సూచిస్తుందని ఆయన వివరించారు.

గొడుగులు మళ్లీ అల్మారాలోకి, స్వెట్టర్లు బయటకు...
దేశంలో నవంబరు నెలలో చలికాలం ఆరంభం అవుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లు వర్షాకాలంలో ప్రజలు వాడిన గొడుగులను పక్కన పెట్టి, చలి నుంచి కాపాడి వెచ్చదనాన్ని ఇచ్చే స్వెట్టర్లను బయటకు తీసే సమయం ఆసన్నమైందని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు చెప్పారు.


ఉష్ణోగ్రత మార్పులపై ఐఎండీ నివేదిక ఏం చెబుతుందంటే...
2025 నవంబరు నెలకు భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నెలవారీ అవలోకనాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం సాధారణ పద్ధతిని అనుసరించకపోవచ్చని సూచిస్తోంది. ఈ అంచనా అసాధారణమైన ఉష్ణోగ్రత మార్పులు, ఆశ్చర్యకరమైన ఊహించని నమూనాల శ్రేణిను వెల్లడిస్తోంది.సాధారణంగా చలికాలంలో పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా, రాత్రివేళల్లో తక్కువగా ఉండి చలి వణికిస్తుంది. కానీ వాతావరణ పరిస్థితుల అనూహ్య మార్పుల వల్ల భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ నెలలో వెచ్చని రాత్రులు రానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ణ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సరళంగా చెప్పాలంటే రాత్రివేళ ఉష్ణోగ్రతలు నవంబర్ నెలలో చారిత్రక సగటు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

పగలు సాధారణం కంటే చల్లదనం
నవంబరు నెలలో వెచ్చని రాత్రులకు విరుద్ధంగా,పగటి సమయంలో సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించారు. పగలు సగటుగా లేదా కొంచెం చల్లగా అనిపించే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వెచ్చని రాత్రులు, పగలు చల్లని గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. వాతావరణంలో మార్పులు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, ఉత్తర పశ్చిమ, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయాల పాదభాగాల్లో సంభవించే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.

ఐఎండీ హైదరాబాద్ శాస్త్రవేత్త ధర్మరాజు


వాతావరణ వైరుధ్యాల నెల...నవంబర్

దేశంలోని చాలా ప్రాంతాల్లో నవంబరు నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.లా నీనా పరిస్థితులు ఎక్వటోరియల్ పసిఫిక్ మహాసముద్రంపై ప్రబలంగా ఉన్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు. ఈ నవంబర్ భారతదేశానికి వాతావరణ వైరుధ్యాల నెలగా రూపొందుతోందని ఆయన తెలిపారు. సాధారణం కంటే వెచ్చని రాత్రులు, సగటు కంటే చల్లని పగళ్ల అసాధారణ కలయిక ఉంటుందని ఐఎండీ హైదరాబాద్ శాస్త్రవేత్త ధర్మరాజు వివరించారు.

వాతావరణంలో మార్పులు ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం
భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నవంబర్ నెలలో వాతావరణం అనూహ్య మార్గంలో సాగబోతోంది. చలి, వేడి మధ్య ఈ వ్యత్యాసం ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాతావరణ మార్పులను సులభంగా ఎదుర్కొనవచ్చు.


Tags:    

Similar News