ప్రకృతిలో పరవశం..నర్సాపూర్ ఎకో పార్క్ పర్యాటకులకు కొత్త గమ్యం

తెలంగాణలోని మెదక్ జిల్లాలో కొత్త పర్యాటక ఆకర్షణ..నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ ప్రారంభం

Update: 2025-11-02 01:00 GMT
ఇదీ నర్సాపూర్ ఎకో పార్కు

గరంలోని హడావుడి, కాలుష్యం నుంచి కొంత దూరం వెళ్లి పచ్చని ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారా? అయితే నర్సాపూర్ అడవుల మధ్య వెలసిన అర్బన్ ఎకో పార్కుకు ఒకసారి వెళ్లి చూడాల్సిందే. చెట్ల మధ్య చల్లని గాలి తాకిడితో, గలగల పారే నీటి మురిపెం శబ్దాలతో మనసు తేలిపోతుంది.


అడవిలో వెలసిన పార్కు
చుట్టూ దట్టమైన పచ్చని చెట్లతో అలరారుతున్న అడవులు...గలగల పారుతున్న నీటి ప్రవాహం...గుండ్రంగా ఉన్న ఈతకొలను...అధునాతన అందాల కాటేజీలు...హైలెస్సా అంటూ నీటిలో పర్యాటకుల బోటింగ్... నీటిపై తేలయాడ కాటేజీలు...పచ్చిక బయళ్లు...విద్యుత్ దీపాల కాంతుల మధ్య నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు పర్యాటకులను రా రమ్మని ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ నగరానికి 48 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్- మెదక్ జాతీయ రహదారిపై వెలసిన నర్సాపూర్ ఎకో పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పర్యాటక రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.



 నర్సాపూర్ ఎకోపార్కులో ఏమున్నాయంటే..

పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన కాటేజీలు...ట్రెక్కింగ్, సైక్లింగ్ ట్రైల్స్...వాచ్ టవర్...స్విమ్మిల్ పూల్...ప్రకృతి పర్యావరణ విద్యా కేంద్రంతో ప్రకృతి ప్రేమికులకు వీకెండ్ గమ్యస్థానంగా నిలిచింది.పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో అర్బన్ ఎకో పార్కు, కాటేజీలను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం సాయంత్రం ప్రారంభించారు. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం సమస్య నేపథ్యంలో పచ్చదనాన్ని రక్షించడం, ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

600 ఎకరాల్లో పచ్చదనం మధ్య...
నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్టులోని 600 ఎకరాల్లోని నర్సాపూర్ ఎకో పార్కులో 33 కాటటేజీలు, రెస్టారెంట్, సెమినార్ హాలు, గెస్ట్ హౌస్, చెక్ డ్యామ్ లు, ఎకో ఎడ్యుకేషన్ సౌకర్యాలున్నాయి. చెంగుచెంగున పరుగులు తీస్తున్న జింకలు...పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్లు అటవీ ప్రాంత సహజ సౌందర్యాన్ని పెంచుతున్నాయి.



 ఉల్లాసంగా గడపాలంటే...

దట్టమైన అడవుల్లో ప్రశాంతంగా, ఉల్లాసంగా గడపాలంటే నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ కు రావాలని అటవీశాఖ ఆహ్వానిస్తోంది. ప్రకృతి, సాహస క్రీడలు...ఉత్కంఠభరితమైన సమ్మేళనం, కొత్తగా ప్రారంభించిన నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ పచ్చదనం, సుందరమైన ట్రైల్స్, ఎకో-కాటేజీలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రకృతి ప్రేమికులు, సాహస ప్రియులు, ప్రశాంతత కోరుకునే వారందరికీ నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ నిజమైన స్వర్గధామం. పచ్చని చెట్ల సువాసనలో, పక్షుల కిలకిలారావాల్లో గడిపే ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒకసారి వెళ్లి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ రావాలనిపించే ప్రదేశం ఇది.



Tags:    

Similar News