‘మొంథా’ వెళ్లిపోయింది…కానీ తుపాన్ల ముప్పు ఇంకా మిగిలే ఉంది!

వేడి సముద్రాలు, చల్లని గాలులు… కొత్త తుపాన్లకు మార్గం...

Update: 2025-11-02 03:49 GMT
తుపాన్ ముప్పు

మొంథా తుపాన్ వెళ్లిపోయింది అనుకునేలోపే… మళ్లీ తుపాన్ల ముప్పు పొంచి ఉందని  శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వాయు కాలుష్యంతో సముద్రాలు వేడెక్కుతుండటంతో బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాల పుట్టుక మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వచ్చే రెండు నెలల్లో తుపాన్ల పరంపర(cyclone season) రానుందని ఐఎండీ పేర్కొంది.


సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు...
మొంథా తుపాను తీరం దాటి బలహీనపడింది. మొంథా విపత్తు తీరినట్లేనని భావిస్తున్న వేళ అయిదు తుపాన్ల ముప్పు ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాయు కాలుష్యంతో సముద్రాల్లో వేడి పెరుగుతుంది. దీనివల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో అంటార్కిటికా నుంచి వచ్చే చల్లని గాలులు..వేడి గాలులను ఢీకొంటాయి. చల్లనిగాలులకు బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు చెప్పారు. బంగాళాఖాతం ఒకవైపు మరో వైపు , అరేబియా సముద్రం,హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.



 రాగల రెండు నెలల్లో మరిన్ని తుపాన్లు...

ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, డిసెంబరు నెలల్లోనే తుపాన్లు సంభవిస్తుంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబరు వరకు మూడు నెలలు తుపాన్లకు నిలయం.నవంబరు నెలలో సముద్ర ఉష్ణ తీవ్రత 26 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మేరకు ఉండటంతో వాయుగుండాలు ఏర్పడటానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. తుపాన్ ఏర్పడిన చోట ప్రశాంతంగా ఉన్నా, తీరం తాకిన చోట తీవ్ర నష్టం సంభవిస్తుంది. తీరం దాటాక భారీవర్షాలు కురుస్తాయి.అండమాన్ నికోబార్, మయన్మార్‌కి పశ్చిమంగా గాలుల కదలికలు తీవ్రంగా ఉన్నాయి. నవంబర్ మొదటి వారంలో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.

తుపాన్లకు ముందే పేర్లు ఎంపిక
హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, పసిఫిక్ మహా సముద్రంలో ఉండే దేశాలు తుపాన్లకు పేర్లు పెడుతూ ఉంటాయి. మొంథా అంటే సువాసన అని అర్థం. ఈ పేరును థాయిలాండ్ దేశం పెట్టింది. భవిష్యత్ లో రాబోయే ఐదు తుపాన్ల పేర్లను ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి.సెన్యార్ (Senyar) తుపాన్ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పెట్టింది. ఆ తర్వాత డిత్వా (Ditwah) తుపాను రానుందని ఈ పేరును యెమెన్ దేశం నిర్ణయించింది. మూడో తుపాను ముప్పునకు అర్నబ్ (Arnab) అనే పేరును బంగ్లాదేశ్ ప్రకటించింది. ఇక నాలుగో తుపాను పేరును మురసు (Murasu) అని భారతదేశం నిర్ణయించింది. ఐదో తుపాను అక్వాన్ (Akvan) పేరును ఇరాన్ దేశం తెలిపింది. తుపాన్లు రాక ముందే వివిధ దేశాలు పేర్లను ముందస్తుగా నిర్ణయించాయి.



 ఐఎండీ తుపాన్ల గణాంకాలను పరిశీలిస్తే...

వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1970 నుంచి 2025 వ సంవత్సరం వరకు గడచిన 55 ఏళ్ల కాలంలో 31 తుపాన్లు సంభవించగా, అవన్నీ అక్టోబరు, నవంబరు నెలల్లోనే వచ్చాయి.ఐఎండీ తుపాన్ల గణాంకాలను పరిశీలిస్తే వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమైన తర్వాత తుపాన్లు వస్తుంటాయి.రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ నుంచి సెప్టెంబరు వరకు కురిసిన భారీవర్షాల వల్ల వరదనీరు బంగాళాఖాతంలో కలవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతల్లో తేడా వస్తుంది. హిమాలయాల నుంచి వచ్చే గంగ, బ్రహ్మపుత్ర నదుల నుంచి నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది. సముద్ర ఉష్షోగ్రతల్లో తేడాల వల్ల అల్పపీడనాలు ఏర్పడి, అవి తీవ్ర తుపాన్లుగా మారుతున్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

బంగాళాఖాతంలోనే అధిక తుపాన్లు ఎందుకు వస్తాయంటే...
ప్రపంచంలోనే అత్యధికంగా తుపాన్లు బంగాళాఖాతంలో వస్తున్నాయని ఐఎండీ తుపాన్ల గణాంకాలను పరిశీలిస్తే విదితమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ మూడు రోజులకు ఒక తుపాన్ సంభవిస్తుండగా, ఏటా వీటి సంఖ్య వంద దాకా ఉంటుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 1891 వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 522కు పైగా తుపాన్లు బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. అంటే ప్రపంచంలో 7 శాతం తుపాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయని ఐఎండీ తెలిపింది.దేశంలో ఏర్పడే తుపాన్లు అత్యధికంగా బంగాళాఖాతంలోనే ఏర్పుడుతున్నాయి. బంగాళాఖాతంలో నీరు వేడిగా ఉండటంతో తుపాన్లు సంభవించడానికి అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రం తూర్పు తీరం కంటే చల్లగా ఉంటుంది.బంగాళాఖాతంలోని తీర ప్రాంతాల్లో ఉన్న ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు తుపాన్ల వల్ల తరచూ దెబ్బతింటున్నాయి.బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడటానికి నాలుగు రెట్లు అనువైన పరిస్థితులున్నాయి.మొంథా తుపాన్ ప్రభావం వల్ల ఈ ఏడాది ఉత్తరాది నుంచి శీతల గాలులు ఆలస్యంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ఏడాది చలి గాలుల తీవ్రత సమయం తగ్గవచ్చని చెప్పారు.


ఒడిశాకు తుపాన్ల ముప్పు అధికం...
బంగాళాఖాతంలో గాలి వేగం, సముద్ర ఉష్ణస్థితి అధికంగా ఉండటం వల్ల నీరు వేడెక్కి తుపాన్లకు దారి తీస్తుందని ఐఎండీ అధికారులు చెప్పారు. బంగాళాఖాతం తీర ప్రాంతాల్లోని పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తుపాన్ల బారిన పడి ఎక్కువగా దెబ్బతింటుంటాయి. దేశంలో తుపాన్ ముప్పు 48 శాతం ఒడిశా రాష్ట్రానికి అధికంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాన్ ముప్పు 22 శాతం, పశ్చిమబెంగాల్ కు 18.5 శాతం, తమిళనాడుకు 11.5 శాతం తుపాన్లు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అధికారులు గత రికార్డుల ఆధారంగా ముప్పును అంచనా వేశారు.అరేబియా సముద్రంలో నీరు చల్లగా ఉండటం వల్ల తుపాన్లు తక్కువగా వస్తుంటాయి.

వాయుగుండం తుపాన్ గా మారి...
సముద్రంలో ఉష్ణోగ్రత, అల్పపీడనం తేడా వల్ల గాలిలో కదిలిక వల్ల అల్పపీడనం వాయుగుండం వేడిగాలి పైకి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. అల్పపీడనం తీవ్రంగా మారితే తుపానుగా మారుతుంది. సముద్రంలో గాలుల వల్ల సుడులు ఏర్పడతాయి. ఉష్ణోగ్రత మార్పుల వల్ల తక్కువ ప్రెషర్ ఉంటే అల్పపీడనం ఏర్పడి తుపాన్ గా మారుతాయి. కన్ను తుపాన్ ప్రభావంలో కన్ను చుట్టూ వలయాకారంలో తుపాన్ కేంద్ర స్థానం ప్రశాంతంగా

తుపాన్లను ఎదుర్కొనేందుకు ఒడిశా చర్యలు
దేశంలోనే తుపాన్ల ముప్పు అధికంగా ఉన్న ఒడిశా రాస్ట్రం దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా సముద్ర తీర ప్రాంతాల్లో తుపాన్ సహాయక శిబిరాలను నిర్మించింది. తుపాన్లు సంభవించినపుడు తీర ప్రాంత ప్రజలను ఆ సహాయ శిబిరాలకు తరలించి ఆవాసం కల్పిస్తారు. సముద్ర తీర ప్రాంతాల్లో 122 సైరన్ టవర్ల సాయంతో తుపాన్ హెచ్చరికలను ఒడిశా జారీ చేస్తుంది. దీంతోపాటు భారీ గాలులను తట్టుకునేలా ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠం చేశారు. మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికల జారీ వ్యవస్థ, లొకేషన్ బేస్డ్ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేశారు.



 ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తీరం దాటింది...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లాడించిన మొంథా తుపాన్ కాకినాడ- కళింగపట్నం మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. మొంథా రూపు మారి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలను కురిపించింది.

తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మొంథా తుపాన్’
ఏపీ భూభాగంలో తీరం దాటిన మొంథా తుపాన్ తెలంగాణలో అతి భారీవర్షంతో విధ్వంసం సృష్టించింది.మొంథా తుపాన్ ఏపీలో తీరం దాటినా తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపించింది. దీని వల్ల పలు తెలంగాణ జిల్లాల్లో భారీవర్షాలు, వరదలు సంభవించాయి. తుపాన్ తీరం దాటాక బలహీన పడే క్రమంలో నైరుతి దిశలో ఉన్న తెలంగాణపై ప్రభావం చూపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తెలంగాణలోని వరంగల్, హన్మకొండ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భారీవర్షాలతో వరద విపత్తుకు మొంథా కారణమైంది.వాతావరణశాఖ శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులను చేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాను మొంథా అతలాకుతలం చేసింది.ఏపీలో తీరం దాటాక తెలంగాణలో 40 సెంటీమీటర్ల వర్షం కురిపించిందంటే దీని ప్రభావం ఏమేర ఉందో విదితమైంది. భారీవర్షాలతో వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. పలు ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి.



 తీరని నష్టం మిగిల్చిన తుపాన్లు

2010వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు మొత్ం 14 తుపాన్లు సంభవించాయి. జల్ నుంచి మొంథా దాకా సంభవించిన తుపాన్లు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,244 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేశారు.1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారుల సర్వేలో తేలింది. తెలంగాణలో మొంథా తుపాన్ వల్ల 4.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం కూడా భారీగా ఉంది. మొంథా తుపాన్ ఏపీలో తీరం దాటినా తెలంగాణలో తీరని నష్టాన్ని మిగిల్చింది.


తుపాన్లతో అతలాకుతలం...

2023లో వచ్చిన మికౌంగ్ తుపాన్ ఏపీతోపాటు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పెద్దఎత్తున ఆస్తినష్టం జరిగింది. 2021లో డిసెంబరులో వచ్చిన జవద్ తుపాన్ ఒడిశా;ఏపీలను దెబ్బతీసింది. 2020లో వచ్చిన నివర్ తుపాన్ తమిళనాడు, ఏపీని అల్లాడించింది. 2019లో వచ్చిన బుల్ బుల్ తుపాన్ పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. క్యార్ తుపాన్ కర్ణాటక తీరాన్ని దెబ్బతీసింది. 2018లో సంభవించిన గజ తుపాన్ తమిళనాడును గజగజలాడించింది. 2018లో వచ్చిన టిట్లి తుపాన్ ఒడిశా, ఏపీలో భారీనష్టం జరిగింది. 2017 వ సంవత్సరంలో ఓఖి తుపాన్ కేరళ, తమిళనాడు రాష్ట్రాలను, వర్దా తుపాన్ చెన్నైలో విధ్వంసాన్ని మిగిల్చింది.



 తుపాన్ల ముప్పు ఇలా...

గడచిన 15 ఏళ్లలో తుపాన్ల ముప్పు బంగాళాఖాతంలో పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.మొంథా, మికౌంగ్,మాండౌస్, జవద్, బురేవి, నివర్, బుల్ బుల్, గజ, టిట్లీ, ఓఖి, వర్ణా, హుద్ హుద్, లెహార్, హెలెన్, ఫైలిన్, నీలం, థేన్, జల్ తుపాన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి.విశాఖపట్టణంపై విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది.2014లో హుద్ హుద్ విశాఖను, 2013లో హెలెన్, లెహార్ తుపాన్లు ఏపీని, ఫైలిన్ ఒడిశా, ఏపీని అల్లాడించాయి.

ఎన్ని తుపాన్లు ఏర్పడ్డాయంటే...
గడచిన 129 ఏళ్లలో బంగాళాఖాతంలో 234 తుపాన్లు సంభవించాయి. అరేబియా సముద్రంలో గత 120 సంవత్సరాల్లో 23 తుపాన్లు ఏర్పడ్డాయి.గత అయిదేళ్లలోనే 12 తుపాన్లు సంభవించాయి. మొంథా తుపాన్ 13వ తుపాన్. ప్రపంచంలో ప్రతీ మూడు రోజులకు ఒక తుపాన్ సంభవిస్తున్నాయి. ఏటా 80 నుంచి 100 తుపాన్లు ఉద్భవిస్తున్నాయి. 2021వ సంవత్సరంలో వచ్చిన మోచా తుపాన్ వల్ల గంటకు 277 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 2021వ సంవత్సరంలో సంభవించిన టకాటే తుపాన్ 222 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల నష్టం ఎక్కువగా జరిగింది.గ్లోబల్ వార్మింగ్ ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అధిక ఉష్ణ స్థితుల ప్రభావం వల్ల తుపాన్లు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు.

రాకాసి అలలు...భీకర గాలులు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్లు చుట్టు పక్కల ప్రాంతాలను కల్లోలం చేస్తుంది. సముద్రంలో ఏర్పడే రాకాసి అలలు.. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వీచే భీకర గాలులు...అతి భారీ వర్షాలతో సముద్ర తీర ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిలిస్తుంది. ఈ విపత్తు అపార ప్రాణ, ఆస్తి,పంట నష్టాన్ని మిగిలిస్తోంది.

వాతావరణ శాస్త్రవేత్తల ఆందోళన 
గత కొన్నేళ్లుగా బంగాళాఖాతంలో తుపాన్ల తీవ్రత, సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంపై వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాయు కాలుష్యం, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలు తుపాన్ల సీజన్‌ను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. మొంథా తుపాన్ మిగిల్చిన నష్టాలు ఇంకా చెరగకముందే మరో ఐదు తుపాన్ల సూచనలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. శాస్త్రవేత్తలు తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News