‘కులగణన’పై క్యాబినేట్ లో చర్చించబోతున్నాము: సిద్దరామయ్య
గాంధీ, పటేల్, అంబేడ్కర్ ను స్వంతం చేసుకోవడానికి మనువాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-14 10:59 GMT
ఈ నెల 17న కర్ణాటక లో ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరగబోతోందని, ఆ సమావేశంలో కులగణన నివేదికపై చర్చించిన తరువాతే దాని పై మాట్లాడతానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం అన్నారు. అప్పటి వరకూ కులగణన నివేదిక గురించి మాట్లాడబోమని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ ఏకైక అంశంపై చర్చించడానికి మేము ఏప్రిల్ 17న కేబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేసాము. అక్కడ చర్చిస్తాము. చర్చ తరువాత నేను మాట్లాడతాను’’ అని సిద్దరామయ్య అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించిన తరువాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక మంత్రివర్గం ఏప్రిల్ 11న సామాజిక ఆర్థిక విద్యా సర్వేను ఆమోదించింది. దీనిని సంక్షిప్తంగా కులగణనగా పిలుస్తున్నారు.
రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కమిషన్ అప్పటి చైర్ పర్సన్ హెచ్ కాంతరాజు ఆధ్వర్యంలో కుల గణన నివేదికను రూపొందించే పనిని చేపట్టింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య మొదటి పదవీకాలం ముగిసే నాటికి సర్వే పనులు మాత్రమే పూర్తయ్యాయి. తరువాత జయప్రకాశ్ హెగ్దే ఫిబ్రవరి 2024న ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాడు.
అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించలేదు: సీఎం
స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించిందన్న వాదనలను ఆయన ఖండించారు. తన ఓటమికి హిందూత్వ సిద్దాంతకర్త విడీ సావర్కర్, కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత్ డాంగే కారణమని అంబేడ్కర్ లేఖ రాశాడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గాంధీ, అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లను సొంతం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
‘‘అంబేడ్కర్ ను వ్యతిరేకించి, మహ్మతా గాంధీని హత్య చేసిన వారు వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన మనువాదులు ఆయనను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని సిద్ధరామయ్య ఆరోపించారు.