రేపు శ్రీవారి వీఐపీ దర్శనాలు రద్దు- తిరుమలపై తుపాను ప్రభావం
తుపాను హెచ్చరికల ప్రభావం తిరుపతి తిరుమలపై పడింది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
తుపాను హెచ్చరికల ప్రభావం తిరుపతి తిరుమలపై పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 15న ఏర్పడిన తుపాను నేపథ్యంలో అక్టోబర్ 16న (బుధవారం) అన్ని రకాల వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా దర్శనాలను రద్దు చేసింది. దీంతో ఈవేళ అంటే అక్టోబర్ 15న అదనపు ఎగ్జిక్యూటివ్ కార్యాలయంలో సిఫార్సు లేఖలను స్వీకరించరని టీటీడీ ప్రకటించింది. భక్తుల సర్వదర్శనం మాములుగా కొనసాగుతుంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారానికి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా. ఈ అల్పపీడనం బుధవారానికి తుఫాన్‌గా మారుతుందని... 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్యంగా పయనించి ఈనెల 16కల్లా వాయుగుండంగా బలపడుతుందని ఇస్రో వాతావరణ విభాగం కూడా హెచ్చరించడంతో టీటీడీ అప్రమత్తమైంది. వీఐపీలు వస్తే భద్రతా చర్యలు చేపట్టడం కష్టమవుతుంది. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.