‘గుప్పెడు ఓట్ల కోసమా ఇదంతా’
కేరళ సీఎం విజయన్ విస్మయం;
By : Praveen Chepyala
Update: 2025-01-04 08:00 GMT
జమాతే ఇస్లామీతో కేరళలోని కాంగ్రెస్ మిత్ర పక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం(IUML) లీగ్ తో జతకట్టడంపై కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు. ముస్లిం లీగ్, కాంగ్రెస్ తిరిగి మతతత్వ వాదులకు లొంగిపోయిందని విమర్శలు గుప్పించారు.
దేశంలో మైనారిటీ హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, అయితే దాని కోసం మతతత్వానికి లొంగిపోకూడదని విజయన్ అన్నారు. తీవ్రవాద భావాలు గల జమాతే ఇస్లాం ను ఇస్లాంలోని సున్నీ వర్గం ఎల్లప్పుడూ దూరంగా ఉంచుతుందని, అయితే ఇప్పుడూ యూపీఎఫ్ తో చేరారని ఇది ప్రమాదకర పరిణామని అన్నారు.
సీపీఐ(ఎం) మలప్పురం జిల్లా సదస్సులో భాగంగా జరిగిన బహిరంగ సభలో మార్క్సిస్టు యోధుడు మాట్లాడుతూ... మైనారిటీ మతతత్వవాదం, మెజారిటీ వాదానికి పరిష్కరం కాదని,రెండు పరస్పర ఆధారమైనదని అభిప్రాయపడ్డారు.
‘‘ ముస్లిం లీగ్ మతతత్వవాదులకు లొంగిపోయే స్థితిలో ఉంది. ఇదే ధోరణి కొనసాగితే ఈ మతతత్వ శక్తులు చివరకు లీగ్ నే మింగేస్తాయి’’ అని విజయన్ హెచ్చరించారు. ఇటువంటి రాజకీయ ప్రమాదాలను ముందస్తుగానే రాజకీయపార్టీలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
‘‘ కేవలం కొన్ని ఓట్లను పొందడానికి రాజకీయ పార్టీలు ఇలాంటి దురుద్దేశానికి పాల్పడట కూడదు, మేము అలాంటివి చేయట్లేదు’’ అన్నారు. కేరళలో ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ ఏకమై వామపక్ష ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు.
ఓట్ల కోసం ఎవరితోనైనా పొత్తుపెట్టుకోవడానికి కాంగ్రెస్, ముస్లిం లీగ్ సిద్దమయ్యాయని, ఇది ప్రమాదకర వైఖరి అని సీఎం అన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్ పాల్పడుతున్న మత హింసలో ప్రాథమికంగా ముస్లిం సమూహాలు, క్రైస్తవులు బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఆ మాట అనగలదా?
దేశంలో కాంగ్రెస్ మతతత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీగా చెప్పుకోగలదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కేరళ బీజేపీలో చేరుతున్నారని ఈ అనుభవం నుంచి పార్టీ ఏదైనా నేర్చుకుందా? అని ప్రశ్నించారు.
సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా దేశం పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు మతవాద శక్తులతో బహిరంగ వైఖరిని అవలంబిచడం ఏంటని అన్నారు. తాము రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, ఏ పక్షంతోనే రాజీపడబోదని హమీ ఇచ్చారు.
అంబేడ్కర్ కు అవమానం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను అవమానించారని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ విధానాలనే అవలంభిస్తోందని, ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందన్నారు. ఆర్ధిక సరళీకరణ వంటి విధానాలను ప్రవేశపెట్టడం తప్పని కాంగ్రెస్ ఇప్పుడు నమ్ముతోందా? అని ప్రశ్నించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఓకే ఆర్థిక విధానాన్ని అవలంభిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మత ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. దేశంలో అంతా సరళీకరణ విధానాలను అవలంభిస్తుంటే.. తాము ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అమలు చేస్తోందని కేరళ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.