‘మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం’
ప్రధాని మోదీని సమయం కోరిన ఎంకే స్టాలిన్ ..;
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) 2026లో జరగనుంది. అయితే కేంద్రం అనుసరించే విధివిధానాల వల్ల తమిళనాడుకు తీవ్రం నష్టం వాటిల్లుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి(Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు వివిధ పార్టీల ముఖ్యమంత్రులతో కలిసి ఇటీవల చెన్నైలో ఆయన అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు కూడా. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ కీలక అంశంపై స్టాలిన్ ఒకసారి ప్రధాని మోదీ(PM Modi)తో మాట్లాడాలని భావిస్తున్నారు. వివిధ పార్టీల ఎంపీలతో కలిసి వెళ్లి ప్రధానికి వినతిపత్రం సమర్పించాలకుంటున్నారు. అందుకు సమయం కేటాయించాలని కోరుతూ స్టాలిన్ మార్చి 27న ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన ఆలస్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
స్టాలిన్ డిమాండేమిటి?
పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకం కాదంటూనే.. దాన్ని జనాభా ప్రాతిపదికన చేయడం సరికాదంటున్నారు స్టాలిన్. ‘‘తమిళనాడులో ఎంపీ సీట్ల తగ్గడం వల్ల పార్లమెంటులో మా బలం తగ్గుతుంది. మన అభిప్రాయంతో పనిలేకుండానే చట్టాలు తయారవుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారు. రైతులకు సమస్యలు ఎదురవుతాయి," అన్నది స్టాలిన్ వర్షన్. రాష్ట్రంలో కుటుంబనియంత్రణను పక్కాగా అమలుచేసిన తాము..జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తే నష్టపోతామని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుండటంతో..తమిళనాడు ఎంపీ సీట్లు కోల్పోయే ప్రమాదం గతంలో అన్నారు.