గవర్నర్‌ రవిపై తమిళనాడు సీఎం స్టాలిన్ చిందులు..కారణమేంటి?

‘‘హిందీ మాసాన్ని పాటించే ముసుగులో గవర్నర్ రవి దేశ ఐక్యత, దేశంలో నివసిస్తున్న వివిధ జాతుల ప్రజలను అవమానించారు’’- తమిళనాడు సీఎం స్టాలిన్

Update: 2024-10-19 10:27 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హిందీ మాసాన్ని పాటించే ముసుగులో గవర్నర్ దేశ ఐక్యత, దేశంలో నివసిస్తున్న వివిధ జాతుల ప్రజలను అవమానించారని స్టాలిన్ ఆరోపించారు. చట్టానికి లోబడి పనిచేయని వ్యక్తి, తన ఇష్టానుసారంగా వ్యవహరించే వ్యక్తి గవర్నర్ పదవిలో ఉండేందుకు వీల్లేదన్నారు.

వివాదానికి కారణమేంటి?

దూరదర్శన్ చెన్నై స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాయకులు తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. గాయకులు ("తెక్కనముమ్ ఆదిల్ సిరంత ద్రవిడ నాల్ తిరు నాదుమ్" - దక్కన్‌లోని ద్రావిడ భూమి గొప్పతనాన్ని సూచించే వాక్యం) ఒక లైన్‌ను దాటవేయడంతో ఈ వివాదం తలెత్తింది. అక్కడే ఉన్న మీరు ఆ తప్పును ఎందుకు సరిచేయలేదు?" అంటూ గవర్నర్‌నుద్దేశించి స్టాలిన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. గవర్నర్ కావాలనే ద్రవిడ జాతిని కించపరుస్తున్నారని, హిందీని ప్రతిచోటా రుద్దాలని చూస్తున్నారని స్టాలిన్ ఘాటుగా విమర్శించారు.

స్టాలిన్ వ్యాఖ్యలు దురదృష్టకరం..

స్టాలిన్ వ్యాఖ్యలకు గవర్నర్ అదే ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. స్టాలిన్ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, తమిళతల్లి ప్రార్థనా గీతాన్ని అవమానించినట్టు తనపై తప్పుడు ఆరోపణ చేశారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమిళ భాష ప్రచారానికి తాను చాలా ప్రయత్నాలు చేశానని, ఈశాన్య రాష్ట్రాల్లో తమిళ ప్రచారానికి అస్సాం ప్రభుత్వ సహకారంతో గౌహతి విశ్వవిద్యాలయంలో తమిళ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా జాత్యహంకార అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వినిపించడం దురదృష్టకరమన్నారు.

క్షమాపణ కోరిన దూరదర్శన్..

ఈ ఘటనపై దూరదర్శన్ క్షమాపణ చెప్పింది. గాయకులకు తమిళం లేదా తమిళ్ తాయ్ వాల్తు అనే రాష్ట్ర గీతాన్ని అగౌరవపరిచే ఉద్దేశం లేదని.."అనుకోకుండా జరిగిన పొరపాటు"కి క్షమాపణలు కోరింది.

Tags:    

Similar News