కర్ణాటకలో SIT దర్యాప్తు సామూహిక ఖననాలకు మాత్రమే పరిమితం..
దాదాపు రెండు మాసాల అనంతరం శవమై కనిపించిన కేసుల మాటేమిటి?;
కర్ణాటక(Karnataka) రాష్ట్రం ధర్మస్థల(Dharmasthala)లో అత్యాచారాలు, హత్యలు, సామూహిక ఖననాలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తడంతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అయితే సామూహిక ఖననాలకు మాత్రమే కేసు దర్యాప్తును పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సౌజన్య, పద్మలత, నారాయణ్ సపాల్య కుటుంబాలు హత్య, అత్యాచారం, అదృశ్యం కేసులను SIT పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.
1998 నుంచి 2014 మధ్య కాలంలో తాను ఎన్నో మృతదేహాలను పూడ్చిపెట్టానని ధర్మస్థల ఆలయ పారిశుధ్య మాజీ కార్మికుడు కోర్టులో చెప్పారు. వాటిల్లో కొన్ని అత్యాచార చేసి చంపిన ఆనవాళ్లున్న మృతదేహాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మరణాల వెనుక ప్రభావవంతమైన వ్యక్తుల హస్తం ఉందని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపారు.
సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ దర్యాప్తును కేవలం సామూహిక ఖననాలకే పరిమితం చేసింది. గతంలో అనుమానాస్పద మరణాలు, తప్పిపోయిన వారి కేసుల దర్యాప్తును మినహాయించడం.. బాధిత కుటుంబాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దుఃఖంలో ఉన్న కొన్ని కుటుంబాలను ఫెడరల్ కర్ణాటక కలిసింది.
‘కాలేజీకి వెళ్ళి తిరిగి రాని సౌజన్య..’
ఉజిరెలోని శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో పీయు సెకండీయర్ విద్యార్థిని సౌజన్య 2012 ఆగస్టు 9న అదృశ్యమైంది. రెండు నెలల తర్వాత అక్టోబర్ 10వ తేదీ ఆమె మృతదేహం ధర్మస్థలలోని మన్నా శంఖలో కనిపించింది. ఆమెను గొంతు కోసి హత్య చేశారు. ఆమె చేతులను శాలువతో కట్టేసి హింసించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినా.. ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో ఏకైక నిందితుడు 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు.
"ఐదుగురు పిల్లలలో సౌజన్య నా రెండో కూతురు. ఆ రోజు 'పుడ్వార్' (వరి కోత పండుగ) కావడంతో సౌజన్య ఏమీ తినకుండా హడావిడిగా కాలేజీకి బయలుదేరింది. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. రెండు నెలల తర్వాత శవమై కనిపించింది. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని పోస్ట్‌మార్టం రిపోర్టులో రాసుంది " అని సౌజన్య తల్లి కుసుమావతి చెమర్చిన కళ్లతో చెప్పారు.
"సంవత్సరాల తరబడి న్యాయ పోరాటాలు, నిరసనలు చేస్తున్నా న్యాయం జరగలేదు. ఇప్పుడు SIT ఏర్పాటయ్యింది. సౌజన్య కేసు కూడా దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. న్యాయం జరిగితే ఆమెను దహనం చేసిన ప్రదేశంలో ఒక మందిరాన్ని నిర్మిస్తాం" అని కుసుమావతి ది ఫెడరల్ కర్ణాటకతో అన్నారు.
అంతుచిక్కని పద్మలత హత్య..
1986లో ఉజిరేకు చెందిన పీయూ విద్యార్థిని, స్థానిక కమ్యూనిస్ట్ నాయకుడి కూతురు పద్మలత కిడ్నాప్ అయ్యింది. 56 రోజుల తరువాత ఆమె మృతదేహం నిడలే ప్రవాహంలో బయటపడింది. కేసు నమోదై 39 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చేయలేదు.
"మా సోదరికి న్యాయం జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి మేము ఇంకా బతికే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం SIT ఏర్పాటు చేసింది. మా కేసును కూడా చేర్చి దోషులను శిక్షించాలి" అని పద్మలత సోదరి చంద్రవతి ది ఫెడరల్ కర్ణాటకతో అన్నారు.
భూ వివాదంలో అన్నదమ్ముల హత్య..
2012లో పూజేబైల్‌లో తమ భూమిని ఖాళీ చేసేందుకు నిరాకరించిన తర్వాత
సెప్టెంబర్ 20వ తేదీన ధర్మస్థల బస్టాండ్ సమీపంలోని వారి ఇంట్లో
నారాయణ్ సపాల్య (62) అనే మాహౌట్, అతని సోదరి యమునా (45) హత్యకు గురయ్యారు. "మేము 400 ఏళ్లనాటి మా పూర్వీకుల ఇంటిని ఇచ్చేందుకు నిరాకరించాం. దాని కోసం మా నాన్న, అత్తను చంపేశారు" అని నారాయణ్ కుమారుడు గణేష్ ది ఫెడరల్ కర్ణాటకకు చెప్పారు.
కనిపించని సీబీఐ స్టెనో కూతురు..
మొదటి సంవత్సరం MBBS విద్యార్థిని, మాజీ CBI స్టెనోగ్రాఫర్ సుజాత భట్ కుమార్తె అనన్య భట్ 2004లో ధర్మస్థలలో అదృశ్యమైంది. అనన్య చివరిసారిగా ధర్మస్థల ఆలయం దగ్గర కనిపించింది. ఆమె స్నేహితులు బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి అదృశ్యమైంది.
"అనన్య ఎక్కడ ఉందో తమకు తెలుసని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాకు చెప్పారు. వారు నన్ను అపహరించి గదిలో బంధించి కొట్టారు. నేను నెలల తరబడి స్పృహ కోల్పోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయింది. ఇప్పుడు కూడా నా కూతురి మృతదేహం కోసం వెతుకుతున్నాను. కనీసం ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు " అని సుజాత కన్నీటితో ది ఫెడరల్ కర్ణాటకకు గుర్తుచేసుకుంది .
‘‘గత కొన్నేళ్లుగా ధర్మస్థలలో గుర్తు తెలియని మృతదేహాల గురించి ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసుకునేందుకు రికార్డులు లేవు. గత కేసులను SIT పరిధి నుంచి మినహాయించడం అంటే న్యాయాన్ని బలహీనపర్చడమే’’ అని సౌజన్య జస్టిస్ కమిటీ నాయకుడు టి జయంత్ వ్యాఖ్యానించారు. "ఈ విధానం న్యాయాన్ని దెబ్బతీస్తుంది. సౌజన్య, పద్మలత, నారాయణ్, అనన్య భట్ వంటి పాత కేసులను కూడా SIT దర్యాప్తు చేయాలి" ఆయన డిమాండ్ చేస్తున్నారు.