ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ఫిర్యాదుదారుడి అరెస్ట్..

15 గంటల పాటు విచారించిన అనంతరం ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడిని అరెస్టు చేసిన SIT;

Update: 2025-08-23 09:41 GMT

కర్ణాటక(Karnataka)లోని ధర్మస్థల(Dharmasthala) పుణ్యక్షేత్ర పరిసరాల్లో సామూహిక ఖననాల ఆరోపణలపై SIT దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శనివారం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తాను వందల సంఖ్యలో మహిళలు, బాలికల మృతదేహాలను ఖననం చేశానన్న చెబుతున్న ధర్మస్థల ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు.


15 గంటల పాటు విచారణ..

మృతదేహాల అవశేషాల కోసం అతను చెప్పిన 17 చోట్ల తవ్వకాలు జరిపారు. అయితే రెండు చోట్ల మాత్రమే ఎముకలు బయటపట్టాయి. మిగతా 15 ప్రదేశాలలో మృతదేహాల ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పారిశుధ్య కార్మికుడి ఆరోపణలు వాస్తవమేనా? అని తెలుసుకునేందుకు శుక్రవారం (ఆగస్టు 22) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అతనిని SIT కార్యాలయంలో విచారించారు. SIT చీఫ్ ప్రణబ్ మొహంతి ఆధ్వర్యంలో విచారణ శనివారం ఉదయం 5 గంటల వరకు కొనసాగింది. సుదీర్ఘ విచారణ తర్వాత తనకు ఏమీ తెలియదని చెత్తులెత్తేయడంతో విచారణ బృందం అతనిని అరెస్టు చేసింది. శనివారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోసారి విచారణ కోసం SIT అతనిని పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది.


గతంలో సంచలన ఆరోపణలు..

1998 నుంచి 2014 మధ్య అనేక మంది మహిళలు, యువతుల మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని గతంలో ఆలయ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారంతా అనుమానాస్పదంగా చనిపోయినవారని, కొంతమందిపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని, పశ్చాత్తాపం వెంటాడుతుండడంతో చాలా ఏళ్ల తర్వాత ధైర్యం చేసి బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని చెప్పాడు.

దీంతో సిద్ధరామయ్య (CM Siddaramaiah) ప్రభుత్వం ఈ కేసు విచారణను సిట్‌‌కు అప్పగించింది. విచారణ ప్రారంభించి అతను చెప్పినచోట తవ్వకాలు జరపగా కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఈ క్రమంలో ఇటీవల అతడు మాట మార్చాడు. ‘నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా’ అని తెలిపాడు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలోనే అతడిని విచారించిన దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.

Tags:    

Similar News