ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి అండగా ఉండడం తప్పా?

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటాను సమర్థించుకున్న కర్ణాటక సీఎం;

Update: 2025-04-15 08:16 GMT

‘‘రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా కర్ణాటకలోని మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కుంటోంది.’’ అని ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. హర్యానా రాష్ట్రం హిసర్‌ ఆయన సోమవారం( ఏప్రిల్ 14న) పర్యటించారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, మహారాజా అగ్రసేన్ విమానాశ్రయం నుంచి అయోధ్యకు విమాన సర్వీసును ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు.

మోదీ వ్యాఖ్యలపై కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పందించారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ముస్లిం(Muslims)లకు 4 శాతం రిజర్వేషన్ (Reservations) ఇవ్వడాన్ని సమర్థించుకున్న ఆయన.. ఎందుకు అలా చేయకూడదు? అని ఎదురు ప్రశ్నించారు. ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధరామయ్య సుదీర్ఘంగా ప్రసంగించారు.

‘ముస్లింలంతా ధనవంతులు కాదు’

"దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవడానికి మేం వాళ్లకు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించాం. ముస్లింలంతా ఆర్థికంగా బలమైనవారా? వారంతా విద్యావంతులేనా? అలాంటప్పుడు ఎందుకు వారికి సాయపడకూడదు. మొదట రూ. 50 లక్షలలోపు కాంట్రాక్టు పనులు అప్పగించాం. తర్వాత రూ. కోటికి, ఇప్పుడు రూ. 2 కోట్లకు పెంచాం. దీన్ని బీజేపీ వాళ్లు భూతద్దంతో చూపుతున్నారు," అని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.

‘అలా అంటున్నా నాకు బాధ లేదు..’

‘‘కొంతమంది నన్ను ఉన్నత వర్గ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారు. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. ఏ సమాజానికీ వ్యతిరేకిని కాను. అవకాశాలు కోల్పోయిన వారికి, న్యాయం జరగని వారికి అండగా ఉంటున్నాం. అలా చేయడం తప్ప. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే’’ అని చెప్పారు.

‘అందరికీ అవకాశం ఇస్తున్నాం’

ప్రధాని వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి అండగా ఉంటుందని, అదే పని తమ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. మేం ఎవరి నుంచి ఏమీ లాక్కోవడం లేదని, అందరికీ అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ కాంట్రాక్టులో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కర్ణాటక కేబినెట్ గత నెలలో ఆమోదం తెలిసిందే. 

Tags:    

Similar News