తమిళనాడు పోలీసులపై నమ్మకం లేకనే సీబీఐ విచారణ?

కరూర్ తొక్కిసలాటపై కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Update: 2025-10-14 07:46 GMT
తొక్కిసలాట జరిగిన ప్రాంతం

మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ మధ్య సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉందంటే అది కరూర్ తొక్కిసలాట మాత్రమే. కోలీవుడ్ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు.
ఈ కేసును తాజాగా విచారించిన భారత అత్యున్నత న్యాయస్థానం సీబీఐని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనికి మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ప్రజలు, ఉన్నతాధికారుల ఒత్తిడి, మీడియ కథనాల ప్రభావంతో రాష్ట్ర పోలీసులు నిష్పాక్షిత దర్యాప్తు జరపలేరని న్యాయస్థానం భావించింది.
సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలోని వేలుసామిపురంలో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన అనేక పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి. జస్టిస్ జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
ఒక సాధారణ రాజకీయ కార్యక్రమం సాయంత్రం 7.30 నిమిషాల వరకూ తొక్కిసలాట జరిగి తీవ్ర విషాదంగా ముగిసింది. ఇందులో మహిళలు, పిల్లలు సహ 41 మంది మరణించడం అందరిని కలిచివేసింది. దాదాపు వందమందికి పైగా గాయపడ్డారు.
విధానపరమైన లోపాలు..
సుప్రీంకోర్టు తన తీర్పులో మద్రాస్ హైకోర్టు ను సైతం తప్పుపట్టింది. చెన్నైలోని ప్రధాన బెంచ్, మధురై లోని బెంచ్ రెండు తీర్పులు వెలువరించడం పై అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గమనించింది. ఒక సింగిల్ జడ్జి సంబంధం లేని పిటిషన్ల ను విచారించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసినట్లు గుర్తించారు.
ర్యాలీల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు రూపొందించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) గా పరిగణించి డివిజన్ బెంచ్ ఎందుకు విచారించలేదో సహ విధానపరమైన లోపాలపై ప్రధాన న్యాయమూర్తి నుంచి వివరణ కోరాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
విషాదం జరిగిన తరువాత తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్, హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ను రెండింటిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై న్యాయస్థానానికి నమ్మకం లేకపోవడమే ఈ చర్యకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
భారతీయ న్యాయ సంహిత(BNS) తమిళనాడు ప్రజా ఆస్తి చట్టంలోని సెక్షన్ల కింద నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ప్రజా సమూహ నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపింది. అయితే ఈ చర్యకు తాము తగినంత ప్రతిస్పందన తెలియజేశామని, పోలీసుల నిర్లక్ష్యం లేదని ఆ శాఖ ఇప్పటికే మీడియా ముందు వివరణ ఇచ్చింది. వారికి వారే క్లీన్ చిట్ ఇచ్చుకోవడంతోనే రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై కోర్టు నమ్మకం పెట్టుకోక సీబీఐ విచారణకు ఆదేశించింది.
‘‘ప్రాథమికంగా చూస్తే ఈ వాస్తవం దర్యాప్తు స్వాతంత్య్రం, నిష్పాక్షికత గురించి సాధారణ ప్రజల మనస్సులో సందేహాన్ని సృష్టిస్తుంది’’ అని ఉత్తర్వూలో ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ వర్సెస్ కమిటీ ఆన్ ప్రొటెక్షన్ డెమోక్రాటిక్ రైట్స్ (2010) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. సీబీఐ దర్యాప్తును చాలా తక్కువ కేసులను ఉపయోగించాలనే మైలురాయి తీర్పు ఉత్తర్వూలను కోర్టు ఇక్కడ ప్రస్తావించింది.
కానీ ఈ కేసు జాతీయ పరిణామాలు, ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపడంతో అసాధారణమైన చర్యలకు హమీ ఇచ్చింది. సాధారణ ప్రజలకు దర్యాప్తుపై నమ్మకం కలిగించాలని పేర్కొంది.
ప్రత్యేక కమిటీ..
తొక్కిసలాటపై ఏకపక్ష, పక్షపాత భయాలను తొలగించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేసును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసింది. దీనిలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని సూచించింది.
అయితే వీరు తమిళనాడు కు చెందిన వారు కాకూడదు. ఈ ప్యానెల్ ఆదేశంలో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడం, సాక్ష్యాలను సమీక్షించడం, ఆదేశాలు జారీ చేయడం, ర్యాలీ అనుమతులు, ప్రజా సమూహ నియంత్రణ లోపాలు వంటి వాటిపై విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.
సీబీఐకి బదిలీ చేయబడిన దర్యాప్తును కమిటీ పర్యవేక్షించాలి. సరైన ఆదేశాలు జారీ చేసే స్వేచ్ఛ ఈ కమిటీకి ఉంది. కమిటీ ఖర్చులకు బిల్లులను భరించే బాధ్యత తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశిస్తూనే.. రెండింటిని సమన్వయం చేయడానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని కూడా చెప్పింది.
సీబీఐ దర్యాప్తు చేసిన తరువాత నెలవారీ పురోగతి నివేదికను ప్యానెల్ కు అప్పగించాలి. చట్టబద్దమైన సమయాలలో దర్యాప్తును త్వరగా పూర్తి చేసి అప్పగించాలి. కేస్ రికార్డు సాఫ్ట్ కాపీని జస్టిస్ రస్తోగీ, సీబీఐ డైరెక్టర్ కు సమర్పించాలి.
సామూహిక ర్యాలీలకు..
జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న కరూర్ మార్గంలో టీవీకే సెప్టెంబర్ 26న అనుమతి తీసుకుందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే జనవరిలో ఇదే రోడ్ పై అనుమతి కోరిన మరోపార్టీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించినట్లు చెప్పుకొచ్చారు. ర్యాలీ నిర్వాహకుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల కోసం ముందస్తుగా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయలేదని పిటిషనర్లు తెలిపారు.
టీవీకే సిట్ విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, చనిపోయిన వారి తరఫున కొంతమంది అధికరణ 32 కింద సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
న్యాయం వైపు..
బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టు ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేశాయి. ఈ ఉత్తర్వూను న్యాయం వైపు తొలి అడుగుగా ప్రశంసించాయి. ‘‘మా ప్రధాన డిమాండ్ నిష్పాక్షిక దర్యాప్తు. ఇప్పుడు సీబీఐ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిజం బయటకు వస్తుందని అనుకుంటున్నాం’’ అని తొక్కిసలాటలో మరణించిన యువకుడి తండ్రి అయిన పన్నీర్ సెల్వం పిచ్చైముత్తు అన్నారు. టీవీకే కూడా ఉత్తర్వులను స్వాగతించింది. కానీ ర్యాలీ దాదాపుగా ప్రశాంతంగా సాగిందని, చివరగా అది అదుపు తప్పిందని పేర్కొంది.


Tags:    

Similar News