టీవీకే పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోలీవుడ్ నటుడు, విజయ్ స్థాపించిన టీవీకే రాజకీయ పార్టీ సెప్టెంబర్ 27న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనలో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా దుమారం రేగింది. ఈ రోజు విచారణ ప్రారంభం కాగానే జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియా నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది.
కేసును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై అక్టోబర్ పదో తేదీనే తీర్పును రిజర్వ్ చేసిన న్యాయ స్థానం ఈ రోజు ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
గత మంగళవారం బీజేపీ నాయకుడు ఉమా ఆనందన్ మద్రాస్ హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాడు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. అలాగే మరో తమిళనాడు బీజేపీ నాయకుడు జీఎస్ మణి సైతం సుప్రీంకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.