లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ సమావేశం
“NEP, కేంద్ర నిధులు, NEET వంటి అంశాలపై పార్లమెంటులో గళమెత్తాలంటే తగినంత మంది ఎంపీలు అవసరం.” - తమిళనాడు సీఎం స్టాలిన్;
తమిళనాడులో లోక్‌సభ(Lok sabha) నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు సీఎం స్టాలిన్(M.K. Stalin) తెలిపారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘జనాభాను నియంత్రణలో తమిళనాడు విజయం సాధించింది. అయితే తక్కువ జనాభా వల్ల 8 పార్లమెంటు స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ సీట్లు తగ్గితే.. 39 కాకుండా 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారు’’ అని పేర్కొన్నారు.
భాషా వివాదంపై స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
మరో భాష యుద్ధానికి తాము సిద్ధమని సీఎం స్టాలిన్ ప్రకటించారు. హిందీలో విద్యాబోధనను తమిళనాడు ప్రభుత్వం ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. హిందీ భాష వల్ల ప్రాంతీయ భాషాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇటీవల ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు తమిళం, ఇంగ్లీష్ సరిపోతాయని, కానీ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హిందీని బలవంతంగా మోపుతోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రం ఖండించింది.
మూడు భాషల విధానంపై చర్చ జరుగుతుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన.. “NEP, కేంద్ర నిధులు, NEET వంటి అంశాలపై పార్లమెంటులో గళమెత్తాలంటే తగినంత మంది ఎంపీలు అవసరం.” అని వ్యాఖ్యానించారు.
హిందీ భాషపై కేంద్రం మరో భాషా యుద్ధానికి నాంది పలుకుతోందా అనే ప్రశ్నకు స్టాలిన్ స్పష్టంగా “అవును, ఖచ్చితంగా. మేము సిద్ధంగా ఉన్నాం” అని సమాధానమిచ్చారు.