మా ప్రభుత్వాని పడగొట్టేందుకు.. వాటిని ఉపయోగిస్తున్నారు
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి కర్నాటక ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు.
By : Praveen Chepyala
Update: 2024-07-18 11:02 GMT
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తోందని ఐదుగురు మంత్రులు ఆరోపించారు. తమ ప్రభుత్వం పైకి కుంభకోణం ఆరోపణలు చేసి ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను త్వరలో ఉసిగొల్పుతుందని వారంతా ఆరోపించారు. గురువారం ఐదుగురు రాష్ట్రమంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ వ్యాఖ్యలు చేశారు.
కృష్ణ బైరేగౌడ, దినేష్ గుండూరావు, ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, సంతోష్ లాడ్‌లతో కూడిన మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ కేసులో నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకనాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తోందని, ప్రధానంగా ఈడీ అధికారులు వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
నాయకుల పేరు చెప్పాలని "ఒత్తిడి"
ఈడీ, సీబీఐలు అసలు ఈ కేసును విచారించడం లేదని, ఈ కేసులో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నాయకుల పేర్లను చెప్పాలని తమ కస్టడీలో ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ వాదనకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈడీ నివేదిక ప్రకారం.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకే డబ్బు వినియోగించాం. ఈ డబ్బును ఎన్నికల కోసం వాడుకున్నామని స్టేట్ మెంట్ ఇస్తే, కస్టడీలో ఉన్నవారిని వదిలేస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
“మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్ కేసులో రూ. 3 కోట్లకు పైగా అక్రమాలు జరిగినందున దర్యాప్తు చేసే హక్కు తమకు ఉందని సీబీఐ చెబుతోంది. అయితే దేవరాజు అరసు టెర్మినల్ కేసులో అదే నిబంధనను ఎందుకు వర్తింపజేయలేదు? కోవిడ్-సంబంధిత అక్రమాలపై ఎందుకు విచారణ జరగలేదు? అని మంత్రులు బీజేపీని ప్రశ్నించారు. దేశంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రతీకార ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు, సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని మంత్రులు తెలిపారు.
బీజేపీ చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలకు కర్ణాటక ప్రభుత్వం తగిన సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. "దీన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు" అని మంత్రులు అన్నారు, బిజెపికి "గుణపాఠం నేర్పుతారు" అని హెచ్చరించారు.