రైతులకు వక్ప్ నోటీసులపై కర్ణాటక రానున్న జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్
కర్ణాటకలోని హుబ్లీ, విజయపురా లోని వంద సంవత్సరాలుగా కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు వక్ప్ బోర్టు నోటీసులు జారీ చేసి రికార్డులు మార్చడంపై జేపీసీ..
By : 491
Update: 2024-11-05 13:22 GMT
కర్ణాటకలోని హుబ్బళ్లి, విజయపురా లో రైతుల భూములు వక్ఫ్ ఆస్తులుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ‘వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్’ నవంబర్ 7న ‘హుబ్బళ్లి, విజయపురాల్లో’ పర్యటించి వక్ఫ్ బోర్డు ‘దోపిడీ’ వల్ల నష్టపోయిన రైతులతో సంభాషిస్తారని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మంగళవారం తెలిపారు.
రైతుల భూవివాదాలను ప్రత్యక్షంగా చర్చించేందుకు విజయపురాకు రావాలని ఎంపీ తేజస్వీ సూర్య జేపీసీ ఆహ్వనించిన కొద్దిరోజులకే ఈ స్పందన వచ్చింది. "వక్ఫ్ దోపిడీ చర్య వల్ల నష్టపోయిన రైతులతో సంభాషించడానికి నవంబర్ 7న హుబ్లీ (హుబ్బల్లి), బీజాపూర్ (విజయపుర)లను సందర్శించాలని నేను చేసిన అభ్యర్థనకు వక్ఫ్‌పై జెపిసి చైర్మన్ అంగీకరించారు. చైర్మన్ రైతు సంఘాలు, మఠాలు, అర్జీదారులతో సంభాషిస్తారు. అన్ని వివరాలు జేపీసీ ముందు ఉంచుతాం’’ అని కమిటీ సభ్యుడైన బెంగళూరు సౌత్ ఎంపీ తెలిపారు.
అక్టోబరు 29న రాసిన లేఖలో, విజయపుర జిల్లా చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన రైతుల ప్రతినిధి బృందంతో తాను జరిపిన సమావేశాలను ఆయన ఇందులో ప్రస్తావించారు. బాధితుల ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి, ఫిర్యాదులను స్వీకరించి ప్రజలతో విచారణ జరపాలని పాల్‌ను అభ్యర్థించాడు. వక్ఫ్ బోర్డు చర్యతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జేపీసీకి తెలిపారు.
" దాదాపు ఒక శతాబ్దం పాటు తమ భూములను సాగు చేసిన ఈ రైతుల దగ్గర 1920- 1930ల నాటి రికార్డులు సైతం ఉన్నాయి. అయితే, ఇటీవలి నెలల్లో, వారిలో చాలా మందికి ఎటువంటి ఆధారాలు లేదా వివరణ లేకుండా తమ భూములను వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ నోటీసులు అందజేశారు. ఈ క్లెయిమ్‌ల స్థాయి గణనీయంగా ఉంది, దాదాపు 1,500 ఎకరాలు తమ గ్రామంలోనే వక్ఫ్ ఆస్తిగా పేర్కొనబడ్డాయి" అని పాల్‌కు రాసిన లేఖలో ఆయన వివరించారు.
రైతులకు నోటీసులు అందించడమే కాకుండా, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా కొన్ని భూములకు సంబంధించిన RTC (రికార్డ్ ఆఫ్ రైట్స్, కౌలు, పంటలు), 'పహాణి', మ్యుటేషన్ రిజిస్టర్‌లలో మార్పులు చేశారని పేర్కొన్నారు. తమ భూములను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించారని విజయపుర జిల్లాకు చెందిన ఒక వర్గం రైతుల ఆరోపణల నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వారెవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు.