తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరిన టీవీకే
మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన పార్టీ, రాష్ట్ర దర్యాప్తు పై నమ్మకం లేదన్నా దళపతి పార్టీ
By : The Federal
Update: 2025-09-28 10:10 GMT
మహాలింగం పొన్నుస్వామి
తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికి ఆ పార్టీ కూడా సమాయత్తం అయింది.
తొక్కిసలాటలో తమ తప్పు ఏం లేదు అని చెప్పుకోవడానికి చెబుతూ.. వెంటనే ఈ తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది.
రెండు సంవత్సరాల క్రితం రాజకీయ ప్రయాణం ప్రారంభించిన టీవీకే, ఈ రోజు దాఖలు చేసిన కేసు సోమవారం మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మదురై బెంచ్ ముందుకు విచారణకు రానుంది.
ఈ విషయానికి సంబంధించి టీవీకే ప్రతినిధి నిర్మల్ కుమార్ చెన్నైలో జస్టిస్ ఎం. దండపాణిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రేపు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు మదురై బెంచ్ లో కేసు విచారణకు వస్తుందని వారు మాకు చెప్పారు. ప్రస్తుతానికి మేము ఇంతకుమించి చెప్పలేము. రేపు మధ్యాహ్నం విచారణ తరువాత మా అభిప్రాయాలను చెబుతాము’’ అన్నారు.
రాష్ట్ర దర్యాప్తు పై నమ్మకం లేదు..
ఈ విషాదానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని టీవీకే అనుమానించింది. స్థానిక దర్యాప్తు పై తమకు నమ్మకం లేదంది. ఈ సంఘటన కేవలం విషాదం కాదని, దానికి జవాబుదారీతనం అవసరమని పార్టీ ప్రతినిధి ‘ది ఫెడరల్’ తో అన్నారు.
‘‘రాజకీయ జోక్యం ఇక్కడ ఎక్కువగా ఉంది. స్థానిక దర్యాప్తులను మేము విశ్వసించము’’ అని ఆయన ది ఫెడరల్ కు చెప్పారు.
విజయ్ లక్ష్యంగా రాష్ట్ర అధికారులు దాడి చేస్తున్నారని టీవీకే కార్యకర్తలు ఆరోపించారు. ర్యాలీలో ఆయనపై రాళ్లు, చెప్పులు విసిరారని, తరువాత కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో దర్యాప్తు చేస్తారని, అందుకే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు అవసరమని ఆయన కోరారు.
వేలాది మంది హజరైన విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందని, ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.
ర్యాలీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని, రాజకీయాల నేపథ్యంలో విజయ్ ఒక దాడిలో చిక్కుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొక్కిసలాట తరువాత విజయ్ తిరిగి చెన్నైకి తిరిగి వచ్చాడు. తొక్కిసలాటకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే టీవీకే నాయకులు దీనిని తిరస్కరించారు. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని, దానికి కేంద్ర సంస్థలు కావాలని కోరుతున్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాదీ..
చెన్నైకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాదీ జీఎస్ మణి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, తమిళనాడు ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కరూర్ పోలీస్ సూపరింటెండ్ తో సహ కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులకు పిటిషన్ లు పంపారు.
పది పేజీల పత్రంలో విద్యుత్ కోత ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించారు. ఇది పూర్తిగా గందరగోళం, భయాందోళన, గందరగోళానికి దారితీసిందని మణి చెప్పారు. ఇదే తొక్కిసలాటకు ప్రత్యక్షంగా కారణమైంది.
‘‘పోలీస్, విద్యుత్ శాఖలకు చెందిన రాష్ట్ర అధికారులతో పాటు వారి రాజకీయ ఉన్నతాధికారులపై బలమైన, సహేతుకమైన అనుమానాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లు, ఏక వ్యక్తి కమిషన్ కేవలం కంటితుడుపు చర్య అన్నారు. స్థానిక పోలీసుల దర్యాప్తు పక్షపాతంగా జరిగే అవకాశం ఉందని, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేయాలని మణి పిలుపునిచ్చారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..సాయంత్రం ఎండలో విజయ్ ప్రసంగిస్తున్నాడు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. సభకు హజరైన ప్రజలు ఒకరినొకరు ఢీ కొట్టుకున్న దృశ్యాలు కనిపించాయి.
టీవీకే పర్యటన వాయిదా..
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజా ప్రచార రాజకీయ పర్యటన టీవీకే వాయిదా వేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకూ ప్రతివారం రెండు జిల్లాలను కవర్ చేయడానికి జాగ్రత్తగా ప్రణాళిక పర్యటన వేసుకున్నారు.
అయితే తాజా విషాదంతో ఇప్పుడు దీనిని వాయిదా వేసుకుంది. 30 జిల్లాలోని ఓటర్లతో కనెక్ట్ కావడం, విద్య, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ది వంటి కీలక అంశాలపై ప్రత్యక్షంగా ప్రజలతో మమేకం కావడం టీవీకే లక్ష్యం.
అయితే కరూర్ ఘటన రాష్ట్రాన్ని శోక సంద్రంలో ముంచెత్తాయి. బాధిత కుటుంబాలకు న్యాయం, మద్దతు కోసం విస్తృతంగా పిలుపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ షెడ్యూల్ కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ‘‘బాధలో ఉన్నవారికి ప్రతిబింబించడానికి సంఘీభావం తెలియజేయడానికి ఇది సమయం’’ అని టీవీకే ప్రతినిధి ఒకరు అన్నారు. అయితే ఈ విరామం తాత్కాలికమే అని పరిస్థితులను తాము గౌరవిస్తున్నామని చెప్పారు.