కరూర్ తొక్కిసలాట: టీవీకే నాయకులపై హత్యాయత్నం కేసు..

క్షతగాత్రులను పరామర్శించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశం..మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు ప్రకటించిన TVK చీఫ్ విజయ్..

Update: 2025-09-28 08:39 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu) కరూర్‌‌(Karur)లో తమిళగ వెట్రీ కజగం (TVK) చీఫ్ విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు శనివారం సాయంత్రం భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede) జరిగి సుమారు 39 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 16 మంది మహిళలు, 8 మంది చిన్నారులు కాగా మిగతా వారు పురుషులు.


తొక్కిసలాటకు కారణాలేంటి?

తొక్కిసలాటకు రెండు కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయ్ వేదిక వద్దకు ఆలస్యంగా రావడం, ఊహించిన సంఖ్య కంటే భారీగా జనాలు రావడం. వాస్తవంగా మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకోవాల్సిన విజయ్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కరూర్ చేరుకున్నారు. సభకు సుమారు 10 వేలు వస్తారని అంచనా వేశారు. కాని 30 వేల మంది రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు.


ఎవరెవరిపై కేసులు..

తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు, సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీ నిర్మల్ కుమార్ సహా మరో నలుగురు కీలక కార్యకర్తలపై కరూర్ పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుల్లో టీవీకే కరూర్ వెస్ట్ యూనిట్ జిల్లా కార్యదర్శి మధియఝగన్ అల్లర్లకు నాయకత్వం వహించి హింసను ప్రేరేపించాడని, బుస్సీ ఆనంద్‌ భారీగా జనసమీకరణ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎఫ్ఐఆర్‌లో విజయ్ పేరు లేకపోవడం గమనార్హం.


కొనసాగుతోన్న దర్యాప్తు..

ఇప్పటి దాకా 39 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. మరో 50 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కరూర్ ఎస్పీ ఆర్ ముత్తుకుమార్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ పేరు లేకపోవడంపై ఆయన సమాధానం దాటవేస్తూ. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు.


మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం..

కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (CM Stalin) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం రూ. 10 లక్షలు, గాయపడ్డవారికి రూ. లక్ష పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.


రూ. 20 లక్షల పరిహారం ప్రకటించిన టీవీకే చీఫ్..

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విజయ్. ‘‘నా హృదయం ముక్కలైంది. మాటలతో చెప్పలేని వేదనలో మునిగిపోయా. ఈ బాధ భరించలేనిది, వర్ణించలేనిది.’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షలు ప్రకటించారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Tags:    

Similar News