టీవీకే అధినేత వల్లే కరూర్ తొక్కిసలాట: తమిళనాడు డీజీపీ

మధ్యాహ్నం వస్తామని చెప్పి, సాయంత్రం రావడమే విషాదానికి ప్రధాన కారణమన్న జీ. వెంకటరామన్

Update: 2025-09-28 05:30 GMT
కరూర్ ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సీఎం స్టాలిన్

కరూర్ ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరగడానికి నటుడు విజయ్ కారణమని తమిళనాడు డీజీపీ జి వెంకట రామన్ ఆరోపించారు. మధ్యాహ్నం రావాల్సిన దళపతి, సాయంత్రం వచ్చారని, దీనితో ప్రజలు ఒక్కసారిగా దూసుకు వచ్చారని తెలిపారు.

ఈ ర్యాలీలో ఇప్పటి వరకూ 39 మంది మరణించగా, మరో 95 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 51 మందిని కరూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

చాలా సేపు వేచి చూసిన ప్రజలు..
ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడిన తమిళనాడు డీజీపీ.. రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ చాలా ఆలస్యంగా రావడంతోనే తొక్కిసలాటకు ప్రధాన కారణమన్నారు.
మండుతున్న ఎండలో నటుడి రాకకోసం వేచి చూసిన జనం, ఆహారం, నీరు లేక ఇబ్బంది పడ్డారని చెప్పారు. విజయ్ స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్ లో మధ్యాహ్నం 12 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటానని ప్రకటించారన్నారు. అప్పటి నుంచి జనసమూహం వేదిక వద్దకు రావడం ప్రారంభమైందని వివరించారు.
‘‘సమావేశం జరపడానికి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకూ అనుమతి కోరారు. టీవీకే మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
జనం ఉదయం 11 గంటల నుంచే రావడం ప్రారంభించారు. కానీ ఆయన సాయంత్రం 7.40 కు వేదిక వద్దకు చేరుకున్నారు. ఎండలో ప్రజలకు నీరు, ఆహారం ఇచ్చేవారు లేరు. మా ఉద్దేశం ఎవరిని నిందించడం కాదు. కానీ మేము వాస్తవాలను ముందు చెబుతున్నాము’’ అని ఆయన అన్నారు.
పది వేలమందికి ఏర్పాట్లు కానీ..
ఎన్నికల ర్యాలీ కోసం విజయ్ కు భారీ స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో జనం ఆయనను అనుసరించారు. పోలీసులు ఆయనను సురక్షితంగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆయన పోలీసులను ప్రశంసించాడు.
జన సమూహాం మాత్రం పెరుగుతూనే ఉంది’’ అని ఆయన చెప్పారు. నిర్వాహాకులు ఇక్కడకు పదివేల మంది వస్తారని అంచనా వేయగా, దాదాపు 27 వేల నుంచి 30 వేల దాకా జనం వచ్చారని వెంకటరామన్ చెప్పారు. పోలీసులు 20 వేల మంది జనం వస్తారని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
విధుల్లో కేవలం 500 మంది పోలీసులు మాత్రమే ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడూ.. సమావేశం స్థలం రహదారి అని, ఎక్కువ మంది పోలీసులు మోహరించి ఉంటే ప్రజలకు చోటు చాలేది కాదని అన్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ పెద్ద పార్టీ సమావేశం జరిగిందని ఆయన అన్నాడీఎంకేను ఉద్దేశించి అన్నారు.
కరూర్ చేరుకున్న సీఎం..
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అర్ధరాత్రి దాటిన తరువాత చెన్నై నుంచి కరూర్ చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. తమిళనాడు చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించిన విషాదం ఎన్నడూ జరగలేదని, భవిష్యత్ లోనూ పునరావృతం కాకూడదని స్టాలిన్ అన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కరూర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ హెల్ప్ లైన్ డెస్క్ 04324 256306, వాట్సాప్ 7010806322 ను సంప్రదించడానికి అధికారులు హైల్ప్ లైన్ నంబర్ లను ప్రకటించారు.
విపరీతమైన వేడీ, రద్దీ.. విద్యుత్ కోత..
తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. అలాగే వాతావరణం చాలా పొడిగా ఉంది. విజయ్ రాకకోసం ప్రజలు చాలాసేపు వేచి ఉన్నారు. రాబోయే ఎన్నికల ముందు విజయ్ స్ఠాపించిన టీవీకే రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ ర్యాలీ ‘‘పోలీసులు, దయచేసి సహాయం చేయండి’’ అనే నినాదాలు వేదిక అంతటా ప్రతి ధ్వనించడంతో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆన్ లైన్ లో ప్రసారం అవుతున్న వీడియోలలో విజయ్ తన మద్దతుదారులకు నీటి సీసాలు పంపిణీ చేయడానికి కొద్ది సేపు ప్రసంగం నిలిపివేశారు.
తొక్కిసలాట జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో విజయ్ ఓ ప్రకటన చేశారు. ‘‘ నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని, వర్ణించలేని బాధ, మాటలు వ్యక్తపరచలేని దు:ఖం లో ఉన్నాను.
కరూర్ లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’


Tags:    

Similar News