ద్విభాషా విధానంతో యువతకు నష్టం..

త్రిభాషా విధానంతో ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు- తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి;

Update: 2025-02-28 07:13 GMT

తమిళనాడు(Tamilnadu)లోని డీఎంకే(DMK) ప్రభుత్వం మొదటి నుంచి త్రిభాష విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందీ భాషకు తమిళనేలపై చోటు లేదంటున్న సీఎం ఎంకే స్టాలిన్.. హిందీ, సంస్కృతం భాషల వల్ల శతాబ్దకాలంలో 25కుపైగా మాతృభాషలు కనుమరుగయ్యాయని చెబుతున్నారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించినందుకు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపేశారని, ఇక కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

పొరుగు రాష్ట్రాలకూ లేఖలు..

హిందీ భాషను మీరు కూడా వ్యతిరేకించాలంటూ పొరుగు రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) లేఖ రాశారు. ‘ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా... హిందీ కారణంగా 100 ఏళ్లలో 19 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోల్పోయాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయి. తమిళనాడుకు ఆ దుస్థితి రాకూడదనే పోరాడుతున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై చేస్తున్న దాడిని’ ప్రతిఘటించండి’’ అని స్టాలిన్‌ రాసుకొచ్చారు.

‘సానుకూలంగా స్పందిస్తున్నారు’

అయితే ఎన్‌ఈపీ అమలు వల్ల తమిళ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి అంటున్నారు. రెండు భాషల విధానంతో పొరుగు రాష్ట్రాల యువతతో పోల్చితే తమిళనాడు యువత ఉద్యోగాల విషయంలో చాలా నష్టపోతున్నారని అని ఎక్స్‌లో పోస్టు చేశారు. త్రిభాష విధానం గురించి తాను తమిళనాడులోని వివిధ రంగాల నేతలతో మాట్లాడినప్పుడు..కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానంపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. 

కేంద్ర మంత్రి పర్యటనపై నిరసనలు..

ఇటు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందర్ పర్యటనను నిరసిస్తూ.. తమిళనాడు విద్యార్థి సంఘాల సమాఖ్య (FSO-TN) డీఎంకే నిరసన చేపట్టాయి. ఐఐటీ మద్రాస్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చెన్నై వచ్చిన ఆయనకు నల్ల జెండాలు ఊపి నిరసన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News