సిద్ధరామయ్య ఎదురుదాడి
"ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు."
ప్రతిపక్ష బిజెపి, జెడి (ఎస్) తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపులకు సంబంధించి ఆయన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఎదురుదాడికి దిగిన సిద్ధరామయ్య ..
మైసూరులో శనివారం సీఎం సిద్ధరామయ్య విలేఖరులతో మాట్లాడుతూ.. “మేం ప్రతిపక్ష పాదయాత్రకు వ్యతిరేకంగా జనందోళన మహాసభ నిర్వహించాం. ప్రతిపక్ష కూటమి తప్పుడు ఆరోపణలతో పాదయాత్ర చేస్తోందని జనానికి వివరించాం. ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. నా ప్రతిష్టను దెబ్బతియడం ద్వారా రాజకీయంగా అణచివేయొచ్చని భ్రమపడుతున్నారు. వారి హయాంలో చాలా స్కాంలు జరిగాయి. వాటిని బయటపెడతాం. కొన్ని స్కాంలపై విచారణ జరుగుతోంది. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కుమారస్వామి అయినా, యడియూరప్ప అయినా, విజయేంద్ర అయినా, అశోక్ అయినా అందరిపైనా చర్యలుంటాయి’’ అని హెచ్చరించారు.
ముడా “స్కామ్”లో సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని ఒక ఉన్నత మార్కెట్ ప్రాంతంలో పరిహార స్థలాలు కేటాయించారని, ముడా “స్వాధీనం” చేసిన ఆమె భూమి మిగతా వాటితో పోల్చితే దాని విలువ ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, జేడీ(ఎస్) వారం రోజుల బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర శనివారం మెగా ర్యాలీతో మైసూరులో ముగియనుంది.
ఇటు సిద్ధరామయ్యకు మద్దతుగా ప్రతిపక్షాల ఆరోపణలను, వారి పాదయాత్రను ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ శుక్రవారం మైసూరులో మెగా జనందోళన సదస్సు నిర్వహించింది.
విచారణ కమిషన్..
ముడా "కుంభకోణం"పై దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 14న హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో ఏక సభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
న్యాయవాది-కార్యకర్త టిజె అబ్రహం దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ జూలై 26న “షోకాజ్ నోటీసు” జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం సమర్పించాలని ముఖ్యమంత్రిని ఆదేశించారు. అయితే “షోకాజ్ నోటీసు” ఉపసంహరించుకోవాలని గవర్నర్‌ను కర్ణాటక ప్రభుత్వం కోరింది.