బెంగళూర్ లో ఉన్న జార్జ్ సోరోస్ సంస్థలపై ఈడీ దాడులు

దేశంలో రెజీమ్ ఛేంజ్ కు ఆయన ప్రయత్నిస్తున్నారని ఇంతకుముందు ఆరోపించిన బీజేపీ;

Update: 2025-03-18 13:52 GMT

అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, దాని అనుబంధ సంస్థలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఫెమా కేసులో బెంగళూర్ లో ఉన్న ఆ సంస్థలపై దర్యాప్తు సంస్థలు తమ దృష్టిని కేంద్రీకరించాయి.

సోదాలు జరిపిన ప్రాంగణాల్లో హ్యూమన్ రైట్స్ వాచ్ ఉద్యోగులు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ సిబ్బందికి చెందినవి సైతం ఉన్నాయి. విదేశీ నిధులను అక్రమంగా పొందడానికి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలపై వీటి బ్యాంకు ఖాతాలను కేంద్రప్రభుత్వం స్తంభింపజేసిన తరువాత ఇవన్నీ తమ కార్యాలయాలను మూసివేసి పారిపోయాయి.
విదేశీ మారకద్రవ్యానికి సంబంధించి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)ను ఉల్లంఘించినందుకు ఆమెస్ట్నీ ఇండియా చీఫ్ ఆకార్ పటేల్ కు రూ. 10 కోట్ల జరిమానా విధించగా, ఆ సంస్థకు రూ. 51.72 కోట్ల పెనాల్టీ విధించింది.
ఓఎస్ఎఫ్ పై కేసు..
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్ఈఎంఏ) కేసు ఓఎస్ఎఫ్ ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేకరిస్తున్నారని, ఫెమా మార్గదర్శకాలను ఉల్లంఘించి కొంతమంది లబ్దిదారులు ఈ నిధులు ఉపయోగించుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఆమెస్ట్నీ ఇండియా, హెచ్ఆర్ డబ్ల్యూ రెండు కూడా గతంలో విదేశాల నుంచి నేరుగా నిధులు పొందాయి. అయితే వీటికి సంబంధించి లెక్కలు చెప్పాల్సిందిగా కేంద్రం కోరిన అవి స్పందించలేదు. దీనితో సీబీఐ ఆ కేసు నమోదు చేసింది. లెక్కాపత్రంలో కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో ఈడీ సైతం కేసు నమోదు చేసింది.
ఓఎస్ఎఫ్ ప్రపంచ మానవ హక్కుల కోసం, న్యాయం, జవాబుదారీ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చే సమూహాలకు ఈ సంస్థ భారీ నిధులు సమకూరుస్తుంది.
ఓఎస్ఎఫ్- భారత కార్యకలాపాలు..
ఓఎస్ఎఫ్ 1999 లో భారత్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. భారతీయ సంస్థలలో అధ్యయనాలు, పరిశోధనలు కొనసాగించడానికి విద్యార్థులు స్కాలర్ షిప్ లు, ఫెలో షిప్ లను అందిస్తోంది. అధికారిక డేటా ప్రకారం 2021 లో ఆ సంస్థ 4,06,000 డాలర్లను ఇక్కడ ఖర్చు చేసింది.
‘‘2014 లో మేము భారతదేశానికి ప్రత్యేకమైన గ్రాంట్ మేకింగ్ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇది మూడు రంగాలలో పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది. వైద్య సేవలు, వ్యక్తుల హక్కులు, ప్రజా సేవలు, సమాజ జీవనాన్ని బలోపేతం చేస్తాము’’ అని గతంలో ఓఎస్ఎఫ్ ప్రకటించింది.
కానీ 2016 లో కేంద్ర హోంశాఖ దీనిపై నిఘా పెట్టింది. దేశంలోకి విదేశీ నిధులను స్వీకరించడంలో ఈ సంస్థ నియామాలను ఉల్లంఘిస్తుందని గుర్తించింది. అక్కడ నుంచి వచ్చిన నిధులను దేశంలోని ఇతర ఎన్జీఓ సంస్థలకు పంపిణీ చేయడాన్ని నిషేధిస్తుంది. ఈ చర్యపై ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దానిపై విచారణ జరుగుతోంది.
ఈ సంస్థ అనేక నియామాలను ఉల్లంఘించిందని ఒక ఈడీ అధికారి చెప్పారు. ‘‘ కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు క్రాస్ చేయడానికే ఎఫ్డీఐ, కన్సల్టెన్సీ ఫీజుల రూపంలో నిధులను తీసుకువచ్చింది. ఇవి కూడా ఫెమాకు విరుద్దంగా ఉన్నాయి. తరువాత ఎన్జీఓల కార్యకలాపాలకు నిధులు సమకూర్చారు’’ అని ఈడీ అధికారి ఒకరు వివరించారు.
సోరోస్ ఎకనామిక్ డెవలప్ మెంట్ ఫండ్, ఓఎస్ఎఫ్ తీసుకువచ్చిన ఇతర ఎఫ్డీఐ నిధులు ఎక్కడకు వెళ్లాయో కూడా పరిశీస్తున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది. దీనిలో మారిషస్ నుంచి ఈ నిధులను ఆపరేట్ చేస్తున్న వ్యక్తుల గురించి దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
బీజేపీతో సోరోస్ వైరం..
అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్ భారత్ లో రెజిమ్ ఛేంజ్ చేయడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఇంతకుముందు విమర్శలు చేసింది. ఆదానీ - హిండెన్ బర్గ్ వివాదం సమయంలో కూడా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలను పార్టీ హైలైట్ చేసి విమర్శలు గుప్పించింది.
కమల దళం ప్రకారం.. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరెప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ వంటివి ఓఎస్ఎఫ్ నుంచి నిధులు పొందుతూ దేశ వ్యతిరేక నివేదికలు, కథనాలు తీసుకువస్తున్నాయని విమర్శించింది. వీటిని కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టి దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆధారాలను బయటపెట్టింది. రాహుల్ ను దేశ ద్రోహిగా అభివర్ణించిన కాషాయపార్టీ.. సోరోస్, అమెరికా డీప్ స్టేట్ సాయంతో దేశంలో కుట్రలను అమలుచేస్తున్నారని ఆరోపించారు.
సోరోస్ నిధులతో ఏర్పాటైన ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రాటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ తో సోనియాగాంధీకి సంబంధాలు ఉన్నాయన్ని కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. సోనియా ఈ ఫోరమ్ లో కీలకపాత్ర పోషించారని తరువాత తెలిసింది. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద సోనియాపై కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.


Tags:    

Similar News