నిధుల విడుదలకు ఎన్‌ఈపీతో లింకు పెట్టొద్దు: ప్రధానికి స్టాలిన్ లేఖ

‘‘మా రాష్ట్రంలో ద్వి భాషా విధానమే అమలవుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముడిపెట్టి నిధులకు విడుదలను ఆపొద్దు’’- స్టాలిన్;

Update: 2025-02-20 13:14 GMT

తమిళనాడు(Tamilnadu) ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (MK Stalin) గురువారం (ఫిబ్రవరి 20) ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి సంబంధించిన రూ. 2,152 కోట్ల సమగ్ర శిక్ష అభియాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. SSA నిధుల విడుదలలో జాప్యం కారణంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయ వేతనాలు, విద్యార్థుల సంక్షేమ పథకాలు, RTE ద్వారా బడిపిల్లలకు రీఇంబర్స్‌మెంట్, అగ్రవర్ణ వర్గాల విద్యార్థులకు ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, దూరప్రాంత విద్యార్థులకు రవాణా వసతి అంశాలు ప్రభావితమయ్యాయని స్టాలిన్ లేఖలో వివరించారు. ఈ విషయంలో ప్రధాని వెంటనే జోక్యం చేసుకుని నిధులను విడుదల చేయాలని లేఖలో కోరారు.

నిధుల విడుదలలో జాప్యానికి కారణమేంటి?

తమిళనాట ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ద్వి భాషా విధానం అమలవుతోంది. కేవలం ఇంగ్లీష్ (English), తమిళం (Tamil) భాషల్లో మాత్రమే బోధన ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం.. ప్రతి రాష్ట్రం త్రిభాషా విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని కేంద్రం పాలసీని తీసుకొచ్చింది. దీనిని డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఎన్‌ఈపీని పూర్తిగా అమలు చేయకపోతే సమగ్ర శిక్షా స్కీమ్ కింద నిధులు ఇవ్వమని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఇటీవల ప్రకటించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఈ విద్యా విధానాన్ని అమలుకు ఓకే చెప్పినపుడు, తమిళనాడు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఉదయనిధి మాట..

"హిందీని అంగీకరించిన రాష్ట్రాల్లో వారి సొంతభాష అంతరించిపోయింది. భోజ్‌పురి, బిహారి, హర్యాన్వీ భాషలు దాదాపు నశించిపోయాయి," అని 18న డీఎంకే నిర్వహించిన నిరసనలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఈ రోజు (20వ తేదీ) సీఎం స్టాలిన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాము రెండు భాషాల విధానానికే కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు.

మూడో భాష ఉండదు..

‘‘తమిళనాడు విద్యా వ్యవస్థలో చాలా ఏళ్లుగా రెండుభాషల విధానం అమలవుతోంది. హిందీ భాషలో బోధన ఉండదు. ఆ కారణంగానే నవోదయ విద్యాలయాలు కూడా తమిళనాడులో ఏర్పాటు కాలేదు. రెండు భాషల విధానం, సామాజిక న్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాయి. మా రాష్ట్రంలో రెండు భాషల విధానానే అమలవుతుందని మోదీకి మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నా," అని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News