ఖైదీ నంబర్ 15528 గా ప్రజ్వల్ రేవణ్ణ
పెన్ డ్రైవ్ లను వీధుల్లో పంపిణీ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటున్న మహిళా సంఘాలు;
By : Praveen Chepyala
Update: 2025-08-03 11:42 GMT
అత్యాచారం కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు విధించబడిన తరువాత మాజీ ఎంపీ, ప్రజ్వల్ రేవన్నకు తొలి రోజు భారంగా గడిచిందని సమాచారం. ఆయనకు సాధారణ ఖైదీలు వేసుకునే డ్రెస్ కోడ్ తో పాటు ఖైదీనంబర్ 15528 ను కేటాయించారు.
బెంగళూర్ లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆయన ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టులో జీవిత ఖైదు పడిన తరువాత ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రజ్వల్ కుంగిపోయాడు..
రాత్రి వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని అంచనా వేసి నిలకడగా ఉందని నిర్ధారించారు. ‘‘వైద్య పరీక్షల సమయంలో ఆయన కుప్పకూలిపోయారు. సిబ్బందికి తన బాధను వ్యక్తం చేశారు’’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
దోషిగా నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించానని ప్రజ్వల్ సిబ్బందికి తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం మాజీ ఎంపీ హై సెక్యూరిటీ సెల్ లో ఉన్నారు.
ఆయనకు మెరుగైన వసతులు, భద్రత కల్పిస్తున్నారు. జైలు అధికారుల ప్రకారం దోషులకు ఇచ్చే డ్రెస్ ఇచ్చి ఆయన చేత ధరింపజేశారు.
వీడియోలు ఎవరూ లీక్ చేశారు..
ప్రజ్వల్ జైలులో ఉండటంతో ఈ కేసుతో ముడిపడి ఉన్న పెన్ డ్రైవ్ ను పంపిణీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. బాధితుల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ లను షేర్ చేసి తద్వారా రాజకీయ లాభం కోసం తమ గౌరవాన్ని బహిరంగ పరిచిన వారు కూడా శిక్ష ఎదుర్కోవాలని మహిళా కార్యకర్తలు, సంస్థలు పట్టుబడుతున్నాయి.
రూప హసన్ అనే మహిళా కార్యకర్త ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. ప్రజ్వల్ కు జీవిత ఖైదు విధించడం బాధితులను ఓదార్పునిచ్చిందని అన్నారు. ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక కోర్టు నుంచి వచ్చిన వేగవంతమైన తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని, ఈ తీర్పు ద్వారా ధైర్యం పొంది మిగిలిన బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.
మహిళల గౌరవం పై దాడి..
ఆ పెన్ డ్రైవ్ లను పబ్లిక్ పరం చేయడం ప్రజ్వల్ చేసిన అత్యాచారం లాంటి దారుణమైన నేరమని రూప హసన్ అన్నారు. ‘‘రాజకీయ లాభం కోసమే హసన్ వీధుల్లో పెన్ డ్రైవ్ లను పంపిణీ చేశారు.
ఇది లెక్కలేనన్నీ మహిళల గౌరవాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వారి గౌరవాన్ని బజార్ లో వేలం వేసింది. ఈ చర్యకు పాల్పడిన వారిని మనం గుర్తించి వారిపై కఠిన శిక్ష విధించాలి’’ అని ఆమె పట్టుబట్టింది.
‘‘పెన్ డ్రైవ్ పంపిణీ కేసు దర్యాప్తు అభియోగాలు నమోదు చేసే దశకు చేరుకుందని మాకు సమాచారం ఉంది. దర్యాప్తుసంస్థలు వెంటనే కోర్టులో అభియోగాలు నమోదు చేయాలి. ఈ చర్యకు పాల్పడిన వారిని మనం గుర్తించి వారిపై కఠినమైన శిక్ష విధించాలి’’ అని ఆమె పట్టుబట్టింది.
‘‘పెన్ డ్రైవ్ పంపిణీ కేసు దర్యాప్తు అభియోగాలు నమోదు చేసే దశకు చేరుకుందని మాకు సమాచారం ఉంది. దర్యాప్తు సంస్థలు వెంటనే కోర్టులో చార్జీషీట్ వేసి, ఈ నేరం వెనకాల ఉన్న వారందరికి శిక్ష పడేలా చూడాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
జీవితఖైదు..
ప్రజ్వల్ జీవితాంతం జైలు శిక్ష విధించగా, కోర్టు అతనికి రూ. 11.50 లక్షల జరిమానా విధించింది. అతని కుటుంబానికి ఇంటి పనిమనిషిగా ఉన్న బాధితుడికి రూ.11.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజనన్ భట్, ప్రజ్వల్(34) పై నమోదైన నాలుగు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో ఒకదానిలో అతన్ని దోషిగా నిర్ధారించారు.
ఈ కేసు హసన్ జిల్లాలోని హోలె నరసింహపురంలోని కుటుంబానికి చెందిన గన్నికాడ ఫామ్ హౌజ్ లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న 48 ఏళ్ల మహిళకు సంబంధించింది.
2021 లో హసన్ ఫామ్ హౌజ్ లో బెంగళూర్ నివాసంలో ఆమెపై రెండు సార్లు అత్యాచారం జరిగింది. ఆ చర్యను ప్రజ్వల్ తన మొబైల్ ఫోన్ లో రికార్డు చేశాడు.
ప్రజ్వల్ కు శిక్ష
ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రజ్వల్ పై ఐపీసీ సెక్షన్ 376(2)(కే)(ఒక మహిళపై నియంత్రణ, ఆధిపత్యం, మహిళపై అత్యాచారం), 376(2)(ఎన్) ఒకే మహిళపై పదేపదే అత్యాచారం చేయడం, 354ఏ లైంగిక వేధింపులు, 354బీ, 354సీ, 506, 201, ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఈ) కింద కేసులు నమోదు చేశారు.
ప్రజ్వల్ కు సెక్షన్ 376(2)(కే) కింద జీవిత ఖైదు, రూ. 5 లక్షల జరిమానా, సెక్షన్ 376(2) (ఎన్) కింద జీవిత ఖైదు విధించింది. అంటే మిగిలిన జీవితం మొత్తం ఆయన ఖైదీగా శిక్ష అనుభవిస్తారు. అలాగే 354 ఏ కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా, సెక్షన్ 354 బీ కింద ఏడేళ్ల కఠిన కారాగారా శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది.