PM Modi | ‘కుల రాజకీయాల పేరిట అశాంతి ప్రేరేపణకు కుట్ర జరుగుతుంది’
ప్రధాని మోదీ ‘గ్రామీణ్ భారత్ మహోత్సవ్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు బయటపెట్టకుండానే దేశంలో అశాంతికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు.;
కుల రాజకీయాల పేరిట కొందరు దేశంలో అలజడి సృష్టించాలని, అశాంతిని ప్రేరేపించాలని చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘గ్రామీణ్ భారత్’ మహోత్సవ్’ను ఆయన శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2047 నాటికి ‘వికసిత భారత్’ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
2014 నుంచి గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోదీ ఈ సందర్భంగా వివరించారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలను నిర్లక్ష్యం చేశాయని ఎస్బీఐ నివేదికను ఉటంకించారు. 2012లో 26 శాతంగా ఉన్న గ్రామీణ భారత పేదరికం ఇప్పుడు 5 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
జనవరి 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే ఈ మహోత్సవ్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, మేథావులు పారిశ్రామికవేత్తలు గ్రామీణ పరివర్తన కోసం సాంకేతికతను వినూత్న పద్ధతులను ఉపయోగించుకోవడంపై చర్చించనున్నారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.