'సనాతనలకు దూరంగా ఉండండి’
సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..
కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్(RSS), సంఘ్ పరివార్(Sangh Parivar) పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం రజతోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
'సనాతన'లకు దూరంగా ఉండండి..సీఎం
"సహవాసం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మార్పును వ్యతిరేకించే వారితో కాకుండా సామాజిక పురోగతిని కాంక్షించే వారితో సహవాసం చేయండి" అని సీఎం సూచించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై బూటు విసిరిన ఘటనను ప్రస్తావిస్తూ.. “ఒక 'సనాతనుడు' ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసరడాన్ని దళితులు మాత్రమే కాదు, అందరూ ఖండించాలి. అప్పుడే సమాజం సరైన మార్గంలో పయనిస్తుందని చెప్పగలం.” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
అంబేద్కర్‌ను కీర్తించిన సిద్ధరామయ్య..
బీజేపీ, సంఘ్ పరివార్ అంబేద్కర్ ఆశయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ.."ఎన్నికలలో అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏమిటంటే.. 'సావర్కర్, డాంగే నన్ను ఓడించారు' అని అంబేద్కరే స్వయంగా రాశారు. సంఘ్ పరివార్ అబద్ధాలను బయటపెట్టడానికి ఇలాంటి నిజాలను చెప్పాలి,’’ అని కోరారు.
అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుతూ.."ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఆయన మార్గంలో నడవాలని నేను దీన్ని స్థాపించాను. అంబేద్కర్ లాంటి మనిషి ఎప్పటికీ పుట్టడు. అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, " అని విజ్ఞప్తి చేశారు.
దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ.. "ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించారు" అని అంబేద్కర్‌ను కొనియాడారు.