ఒకే వేదికపై ఉద్ధవ్, రాజ్ ఠాక్రే
మహారాష్ట్రలో శివసేన (UBT), MNS విజయోత్సవ సభ..రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి కలుస్తున్న ఉద్ధవ్, రాజ్ ఠాక్రే సోదరులను 'మరాఠీ ఉద్యమం ఏకం చేస్తుందా?;
మహారాష్ట్ర(Maharashtra)లోని ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 16న ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో జూన్ 17న హిందీని ఆపన్షల్ భాషగా పేర్కొంటూ మరో జీవో జారీ చేసింది.
వర్లిలో విజయోత్సవ వేడుకలు..
ఈ సందర్భంగా శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) విజయోత్సవ వేడుకలను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సెంట్రల్ ముంబైలోని వర్లిలోని NSCI డోమ్ వేడుకలకు వేదికైంది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని "తప్పనిసరి" చేయడాన్ని ఈ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ..
రెండు దశాబ్దాల తర్వాత విడిపోయిన ఉద్ధవ్(Uddav Thackeray), రాజ్ ఠాక్రే (Raj Thackeray) ఒకే వేదికను పంచుకుంటుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయోత్సవ సభకు సాహితీప్రియులు, భాషాభిమానులు, వివిధ కళా రంగాలకు చెందిన వ్యక్తులు హాజరుకావాలని ఇప్పటికే రెండు పార్టీలు పిలుపునిచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే అవిభక్త శివసేనను వీడాక..2005లో జరిగిన మాల్వన్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈ ఇద్దరు చివరిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. తర్వాత అదే ఏడాది రాజ్ థాకరే శివసేనను వీడి 2006లో MNSను స్థాపించారు.
సభకు హాజరుకాలేం..
శివసేన (యుబీటీ) మిత్రపక్షమైన కాంగ్రెస్..ఈ విజయోత్సవంలో పాల్గొనదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ తెలిపారు. అయితే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేయడానికి తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు.
ఇక మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) బ్యానర్ కింద కాంగ్రెస్, సేన (యుబీటీ) తో పొత్తు పెట్టుకున్న ఎన్‌సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం (జూలై 3) పూణేలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇతర కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకావడంలేదని తెలిపారు. అయితే ఈ సభకు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సులే లేదా పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్ హాజరవుతారని ఎన్‌సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు.