నకిలీ మద్యంపై.. కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా?
వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన మంత్రి మండిపల్లి.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-12 16:12 GMT
నాసిరకం మద్యం తయారీకి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) తంబళ్లపల్లి వద్ద వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ రాకెట్ వెనుక ఉన్న అసలైన వారిని తెరమీదకు తీసుకుని వస్తామని ఆయన హెచ్చరించారు.నకిలీ మద్యం వ్యవహారంలో వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యానాల నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ఘాటుగా స్పందించారు.
"నకిలీ మద్యం తయారీలో మా ప్రమేయం లేదని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తారా" అని వైఎస్. జగన్ కు మంత్రి మండిపల్లి సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ఏ పార్టీ నేతల హస్తం ఉందనేది తెలుద్దాం రండి అని మంత్రి మండిపల్లి అన్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి టీడీపీ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యం తయారీ వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తోపాటు తాను కూడా ఉన్నట్లు వైసీపీ ఆరోపించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాఫ్రికాలో ఉన్న వైఎస్. జగన్ సోదరుడు మద్యం వ్యాపారం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారు చేసింది వైసీపీ నేతలే, ఆ విధానం అలవాటు చేసింది కూడా వారే అని ఆయన ఆరోపించారు. వారి ద్వారానే ఇక్కడ అక్రమంగా కంపెనీలు ఏర్పాటు చేసి, ఐదేళ్ల పాటు మంచి కంపెనీలకు రాష్ట్రానికి రాకుండా చేశారని అన్నారు.
వైసీపీ బ్రాండ్ అంబాసిడర్
"ములకలచెరువులో నకిలీ మద్యం మకిలి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, నాకు ప్రమేయం ఉన్నట్లు వైఎస్. జగన్ ఆరోపించడంపై విడ్డూరంగా ఉంది" అని మంత్రి మండపల్లి అన్నారు. ఐదేళ్లపాటు రాష్ట్రంలో వరదలా పారించిన నాసిరక మద్యం తయారీకి కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవహాంలో ఎన్నో విషయాలు కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిందన్నారు. ఈ కేసులో ఎవరికీ న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వలేదనే విషయ గుర్తించుకోవాలన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములకలచెరువు నకిలీ మద్యంలో మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. తప్పులు చేసిన వారిలో ఏ పార్టీ వారు ఉన్న వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.