ఏపీ ఎక్సైజ్‌ సురక్షా యాప్‌తో నకిలీ భరతం పడతాం

ములకలచెరువునకిలీ మద్యంపై అశోక్‌ కుమార్, రాహుల్‌ దేవ్‌ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్‌ శాఖలో మరొకరితో సిట్‌ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Update: 2025-10-12 15:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యానికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌ తెచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆదివారం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆ యాప్‌ గురించిన వివరాలను, దాని పని తీరును వెల్లడించారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటì విమర్శించారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించింది. లీగలైజ్‌ చేసింది. గంజాయిని వాణిజ్య పంటగా భావించి గత పాలకులు పండించారు. గంజాయి సరఫరా చేశారు అని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు... తమకు సంబంధించిన మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారు. బలవంతంగా డిస్టలరీలు హ్యండోవర్‌ చేసుకున్నారు. ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు.

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్‌ వేశాం. దానిపైన విచారణ జరగుతోంది. మద్యం విషయంలో కొందరు ఇంకా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. నేరాలు చేయడం... ఎదుటి వారిపై ఆ నేరాల్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం...కంట్రోల్లో పెడతామని హెచ్చరించారు. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం... ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేది. ఇప్పుడు కంట్రోల్లో పెట్టాం. బెస్ట్‌ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. వీరిలో 16 మందిని అరెస్ట్‌ చేశారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదు చేశారు. ఈ కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్‌ వార్తలు బయటకు వస్తున్నాయి. అరెస్టులతో నిజాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదులుతోంది. దీనిపై మరింత విచారణ కోసం సిట్‌ వేస్తున్నాం. అశోక్‌ కుమార్, రాహుల్‌ దేవ్‌ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్‌ శాఖలో మరొకరితో సిట్‌ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
నాకు ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. ములకల చెరువు ఘటన బయట పెట్టిందే మేము. అరెస్టులు చేసింది మేము. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా మేము. సిట్‌ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు. నకిలీ మద్యం తయారు చేయడం ఆఫ్రికాలో నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటాం. రాజీపడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా.. సస్పెండ్‌ చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇక నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం. అందుకే యాప్‌ తెచ్చాం. బార్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఆ మద్యం బాటిల్‌కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. రిటైల్‌ షాపుల్లో కూడా స్కాన్‌ చేసిన తర్వాతే మద్యం అమ్మాలనే విధానాన్ని తెస్తున్నాం. అలాగే వినియోగదారులు కూడా మద్యం బాటిళ్ల వివరాలను ఎక్సైజ్‌ సురక్షా యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. మద్యం తయారీ తేదీ, టైమ్, బ్యాచ్‌ నెంబరు ఇలా అన్ని వివరాలు ఉంటాయి. ట్రెసబులిటీ, సర్టిఫికేషన్‌ కూడా ఉంటుంది. ఒక షాపునకు సరఫరా చేసిన మద్యం.. వేరే షాపులో అమ్మడానికి కూడా వీల్లేదని, రోడ్ల మీద ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండేందుకే పర్మిట్‌ రూంలు ఇచ్చామన్నారు. మద్యం బాటిళ్లు, మద్యం షాపులకు జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్‌ పెడుతున్నాం. బెల్ట్‌ షాపులనేవి లేకుండా ఉండేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ౖ కుట్రల్లో భాగంగా శవ రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి చనిపోతే శవ రాజకీయం చేశారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ వేయలేదు. పోస్ట్‌ మార్టం కూడా సరిగా నిర్వహించలేదు. ఇలాంటి వాళ్లు ఇప్పుడు శవ రాజకీయాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే కుట్రలు పన్నుతున్నారు. సీబీఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే కేసులున్నాయి. కాలక్షేపం చేయొచ్చని సీబీఐ విచారణ కావాలని పట్టుబడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆశల కోసం పని చేసే ప్రభుత్వం. ఎక్కడా, ఎవ్వరితోనూ మేం లాలూచీ పడం. తప్పు చేస్తే తన మన బేధం చూడం. వ్యాపారం చేసుకోవాలంటే చేయొచ్చు. కానీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పద్దతిగా వ్యాపారాలు చేసుకోండి. తప్పుడు ప్రచారాలు చేసిన వారి ఆటలు ఇక సాగనివ్వం. వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటాం. కావాలని దుష్ప్రచారం చేస్తే వదిలి పెట్టం అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Tags:    

Similar News