వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నాయకులపై కేసులు

మత విశ్వాసాలు దెబ్బతీశారన్న ఆరోపణులతో ఎఫ్ఐఆర్‌లు నమోదు;

Update: 2025-03-19 07:13 GMT

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ నాయకులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉదిక్ర పరిస్థితులకు దారితీసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మతవిశ్వాసాలను దెబ్బతీశారని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బజరంగ్ దళ్‌ కొందరు కార్యదర్శులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గణేశ్‌పేఠ్ పోలీస్ స్టేషన్‌లో మహారాష్ట్ర, గోవా వీహెచ్‌పీ కార్యదర్శి ఇన్‌ఛార్జ్ గోవింద్ షెండే సహా మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

సోమవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో నగరంలోని మహాల్ ప్రాంతంలోని చిట్నిస్ పార్క్‌లో అల్లర్లు చెలరేగాయి. అదే సమయంలో ఓ మత గ్రంథాన్ని దహనం చేశారన్న వదంతులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఆందోళన అనంతరం తమ మనోభావాలు దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో, దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు గణేశ్‌పేఠ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ కేసులో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యదర్శులైన అమోల్ ఠాక్రే, డాక్టర్ మహాజన్, తయాని, రజత్ పూరి, సుశీల్, వృషభ్ అర్కేల్, శుభం, ముకేష్ బరపత్రేల పేర్లు కూడా ఉన్నాయి. వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) ప్రకరణల కింద కేసు నమోదైంది. అయితే ఇప్పటివరకు ఎవరూ అరెస్టు కాలేదని పోలీస్ అధికారి తెలిపారు.

కర్ఫ్యూ విధింపు..

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు నగరంలో కర్ఫ్యూ విధించారు. కొట్వాలి, గణేశ్‌పేఠ్, లాకడ్‌గంజ్ ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలను రోడ్లపైకి అనుమతిస్తున్నారు. పట్టణంలోని 11 అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలు క్షుణ్ణంగా నిఘా పెట్టాయి. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT), రయాట్ కంట్రోల్ పోలీసులను రంగంలోకి దింపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల వైపుగా వెళ్లే రహదారులను మూసివేశారు. కర్ఫ్యూతో ప్రభావిత ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయబడ్డాయి.

ఇదిలా ఉండగా..అల్లర్లకు కారకులపై చర్యలు తీసుకుని, జాతీయ భద్రతా చట్టం (NSA)ని అమలు చేయాలని విహెచ్‌పీ విదర్భ ప్రాంత సహ మంత్రిగా ఉన్న దేవేశ్ మిశ్రా డిమాండ్ చేశారు.

Tags:    

Similar News