ముడా కేసు: కర్ణాటక సీఎం భార్య, ఆమె సోదరుడికి హైకోర్టు నోటీసులు..

మైసూరులోని డీజీపీ, విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌కు కూడా..;

Update: 2025-07-10 12:37 GMT

MUDA (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కేసులో కర్ణాటక(Karnataka) హైకోర్టు గురువారం (జూలై 10) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) భార్య BM పార్వతి, ఆమె సోదరుడు BM మల్లికార్జున స్వామికి నోటీసులు జారీ చేసింది. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మైసూరులోని విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు పంపి కేసు విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.

ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ, సిద్ధరామయ్య, భూ యజమాని దేవరాజు దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి. కామేశ్వరరావు, న్యాయమూర్తి సి.ఎం. జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని స్నేహమయి కృష్ణ కోర్టును కోరగా.. కేసు కొట్టివేయాలని సిద్ధరామయ్య, దేవరాజు కోరారు.

కృష్ణ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కె.జి. రాఘవన్.. ‘‘సీబీఐ దర్యాప్తు కోరుతూ గతంలో పిటీషన్ దాఖలు చేశామని, అయితే పార్వతికి నోటీసు జారీ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విధానపర లోపాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు..సంబంధిత అధికారులకు సైతం నోటీసులు ​​జారీ చేయాలని ఆదేశించింది.

ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సింగిల్ జడ్జి బెంచ్ సమర్థించింది. నెల తర్వాత సిద్ధరామయ్య ఆ ఉత్తర్వును సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసి 10 నెలలవుతున్నా.. అప్పీళ్లపై సమగ్ర విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం నాలుగు అప్పీళ్లను కోర్టులో సమర్పించారు. 

Tags:    

Similar News