మమత ప్రభుత్వానికి వలంటీర్లు తలనొప్పిగా మారారా?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ మర్డర్ కేసులో వలంటీరు సంజయ్‌ను అరెస్టు చేశారు. వలంటీర్ల ఎంపిక సరిగ్గా జరిగితే ఇలాంటి దారుణాలు జరగవని ప్రజలంటున్నారు.

Update: 2024-08-14 07:51 GMT

కోల్‌కతాలోని ఓ ప్రభుత్వాసుప్రతిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవలను స్తంభింపజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇలాంటి ఘనటలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రైనీ డాక్టర్‌ మర్డర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టయితే చేసేశారు. నేరానికి పాల్పడింది వలంటీరే కావడంతో.. వలంటీర్ల ఎంపిక ప్రక్రియ సజావుగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సెలెక్టయిన వలంటీర్ల గత చరిత్రను పోలీసులు పరిశీలించడం లేదా? రాజకీయ అండదండలతో రిక్రూట్ అయిన వారి పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

అసలు వలంటీర్‌ ఎంపిక ఎలా జరుగుతుంది?

కోల్‌కతాలో పోలీసులకు సహాయకారిగా ఉండేందుకు కొంతమందిని వలంటీర్లుగా రిక్రూట్ చేసుకుంటున్నారు. వలంటీర్‌గా చేయడానికి కనీసం 20 సంవత్సరాల వయసు, 8వ తరగతి పాసై ఉండాలి. ఎంపికైన వలంటీర్‌కు తన నివాసానికి దగ్గరలో పోస్టింగ్ ఇస్తారు. గౌరవ వేతనంగా రూ. 15వేలు చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ ఎన్‌రోల్‌మెంట్ కమిటీ చూసుకుంటుంది. ఈ కమిటీ NCC, NSS, సివిల్ డిఫెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలున్న వారికి ఎంపికలో ప్రాధాన్యం ఇస్తుంది.

కాని జరుగుతున్నది మరోలా..

ఎలాగయిన వలంటీర్ పోస్టు దక్కించుకోవాలనుకున్న అభ్యర్థులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. వారి అండదండలతో జాజ్ కొట్టేస్తున్నారు. సంజయ్ ఎంపికలో కూడా స్థానిక పొలిటికల్ లీడర్ పాత్ర ఉందన్న వార్తలొస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులు రెకమెండేషన్ లెటర్ తెస్తున్నారని, ఇంకొంతమంది రాజకీయ నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ రూట్‌లో వచ్చిన వారి పేర్లను లిస్టులో చేర్చి ఎంపిక కోసం ఎన్‌రోల్‌మెంట్ కమిటీకి పంపుతున్నారని సమాచారం.

భార్యపై దాడి..

గత వారం RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్. 33 ఏళ్ల సంజయ్ 2019లో కోల్‌కతా పోలీస్‌ విభాగంలో వలంటీర్‌గా చేరాడు. గతంలో పలు నేరాలతో సంబంధమున్న సంజయ్.. 2022లో గర్భిణిగా ఉన్న తన భార్యపై దాడికి పాల్పడ్డాడు.

పొలిటికల్ ఎఫైర్‌తో చెలరేగిపోయిన సంజయ్..

సంజయ్‌కి మంచి పొలిటికల్ ఎఫైర్ ఉంది. ఆ కారణంగానే పోలీసు వెల్ఫేర్ బోర్డు కేంద్ర కమిటీలో సభ్యుడు కాగలిగాడు. ఆ హోదాను అడ్డం పెట్టుకుని చెలరేగిపోయాడు. నగరంలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు సిబ్బందిని పోలీస్ ఔట్ పోస్టుకు బదిలీ చేయించాడు. సంజయ్ తరచూ పోలీసు అధికారిగా బిల్డప్ ఇచ్చేవాడు. తన బైక్‌పై KP (కోల్‌కతా పోలీసు) అని రాయించుకుని, కోల్‌కతా పోలీసులు ధరించే టీ-షర్టుతో చక్కర్లు కొట్టేవాడు. అర్హత లేకున్నా రోజూ తన బైక్‌కు ప్రభుత్వ ఖాతాలో ఐదు లీటర్ల పెట్రోల్‌ పోయించేవాడు.

రోగుల నుంచి డబ్బులు డిమాండ్..

రాజకీయ నాయకులతో తనకున్న పరిచయాల కారణంగా..సంజయ్ RG కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లో పోస్టింగ్ దక్కించుకున్నాడు. అక్కడే డబ్బుల దందా మొదలుపెట్టాడు. ఆసుపత్రికి వచ్చే రోగుల ఇబ్బందులను క్యాష్ చేసుకునే వాడు. బెడ్ దొరక్కపోతే.. తాను ఇప్పిస్తానని రోగుల నుంచి డబ్బులు లాగేవాడు. కొన్ని వారాల క్రితం ఆస్పత్రికి చెందిన ఓ మహిళా వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. నేరం రుజువైనా చర్యలు తీసుకోలేదు. సంజయ్‌కి ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నేరాలకు పాల్పడుతున్న వలంటీర్లు..

నిజానికి నేరాలకు పాల్పడిన మొదటి వలంటీర్ సంజయ్ కాదు. చాలామంది వలంటీర్లు పలు సందర్భాల్లో అరెస్టయ్యారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలోని భాతర్ స్టేట్ జనరల్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించి, బెదిరించినందుకు సుశాంత రాయ్‌ అనే వలంటీర్‌ను అరెస్టు చేశారు.

2022లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థి సంఘం నాయకుడు అనిస్ తీవ్ర విమర్శలు చేశాడు. తర్వాత అతను హత్యకు గురయ్యాడు. ఈ కేసులో వలంటీర్ ప్రీతమ్ భట్టాచార్యతో పాటు మరో హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు.

సివిల్ సర్వీస్ పరీక్షలకు నకిలీ అభ్యర్థులను పరీక్షకు పంపిన కేసులో మరో వలంటీర్ రాజు హల్దర్‌ను రెండేళ్ల క్రితం అరెస్టు చేశారు. నకిలీ అభ్యర్థితో పరీక్ష రాయించినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రాజు రూ.2 లక్షల నుంచి 3 లక్షలు తీసుకున్నాడు.

దొంగతనాలు, బ్లాక్‌మెయిలింగ్‌, వాహనదారులను వేధించడం మొదలుకొని ఫోర్జరీ వరకు చాలా నేరాల్లో వలంటీర్లు అరెస్టయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది వలంటీర్లు పోలీసు స్టేషన్లలోని కీలక సమాచారాన్ని, కేసు వివరాలను బయటకు చేరవేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పునరుద్ధరించాలి’

వలంటీర్లంతా నేరాలకు పాల్పడరు. అయితే కొంతమంది నేరాలకు పాల్పడుతుండడంతో ఎంపిక ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న డిమాండ్ జనం నుంచి వినిపిస్తుంది. రిక్రూట్‌మెంట్ ముందు వలంటీర్ల ట్రాక్ రికార్డును పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పోలీసు డైరెక్టరేట్‌ను ఆదేశించింది. రాజకీయ సిఫార్సుతో రిక్రూట్‌ అయిన వలంటీర్లు చక్రం తిప్పడం సాధ్యం కాదని పోలీసు అధికారులు అంటున్నారు. 

Tags:    

Similar News