వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ 5కు వాయిదా..

దాఖలయిన 72 పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ;

Update: 2025-04-17 11:49 GMT

కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ సవరణ చట్టం(Waqf Amendment Act)లోని కొన్ని సెక్షన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ అత్యున్నత న్యాయ స్థానంలో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం వీటి విచారణ ప్రారంభించింది.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, రాజీవ్‌ ధవన్‌, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వక్ఫ్‌ ఆస్తులన్నీ రిజిస్టర్‌ చేసుకోవాలన్న నిబంధన సరికాదని, వందల ఏళ్లుగా చాలా ఆస్తులు ‘వక్ఫ్‌ బై యూజర్‌ (ఎలాంటి పత్రాలు లేకుండా చాలా కాలం నుంచి వక్ఫ్‌ ఆస్తులుగా కొనసాగుతున్నవి)’గా కొనసాగుతున్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. అయితే వక్ఫ్‌ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ఉద్దేశమని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు.

‘‘వందల ఏళ్లుగా వ్యక్తిగత ట్రస్టులుగా కొనసాగుతున్న ‘వక్ఫ్‌ బై యూజర్‌’లను ఇప్పుడు ఎలా రిజిస్టర్‌ చేస్తారు? వాటికి పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? రిజిస్టర్‌ చేసుకోకుంటే వక్ఫ్‌ గుర్తింపు (డీనోటిఫై) తొలగిస్తే ఎలా? ఇంతకుముందు చాలా సందర్భాల్లో కోర్టులు ‘వక్ఫ్‌ బై యూజర్‌’ను గుర్తించాయి. ఇప్పుడు మీరు గుర్తింపును వెనక్కి తీసుకుంటే చాలా సమస్యలు చెలరేగుతాయి..’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతవరకు ‘‘వక్ఫ్ బై యూసర్ ఆస్తులను డీనోటిఫై చేయవద్దు. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చెయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దు’’ అని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మే 5కు వాయిదా వేసింది.

Tags:    

Similar News