గవర్నర్ లేఖను తొక్కి పెట్టిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు!
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాసిన లేఖను ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు తొక్కి పెట్టారు.
సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. పైకి మాత్రమే పార్టీల మధ్య విభేదాలు, లోపల అంతా ఒకటేనా? అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ గా ఇటీవలి వరకు బాధ్యతలు నిర్వహించిన ఆర్ మహబూబ్ బాషా సెప్టెంబరు 25న పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ నాటికే కొత్త చీఫ్ కమిషనర్ ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. అందుకోసం రెండు నెలల ముందుగానే చీఫ్ కమిషనర్ పోస్టుకు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది.
మరో నాలుగు సమాచార హక్కు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులో కమిషనర్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అంతకు ముందుగానే ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం ఐదు కమిషనర్ ల పోస్టులకు సుమారు 200 దరఖాస్తులు వచ్చాయి. అయినా ఇంతవరకు ఖాళీగా ఉన్న కమిషనర్ ల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం వెనుకాడటానికి కారణాలు ఏమిటనే చర్చ జోరందుకుంది.
చీఫ్ కమిషనర్ గా ఇన్ చార్జిని నియమించేందుకు కదిలిన ఫైల్...
ప్రస్తుతం సమాచార హక్కు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రత్తిపాటి సామ్యుల్ జొనాథన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులయ్యారు. ఆయనను చీఫ్ కమిషనర్ పోస్టులో ఇన్ చార్జిగా నియమించేందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు పావులు కదిపారు. వీరు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నారు. జొనాథన్ ను ఇన్ చార్జి చీఫ్ కమిషనర్ పోస్టులో నియమించే విషయమై ఫైల్ సర్క్యులేట్ అవుతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? లేదా? అనే చర్చ కూడా జోరందుకుంది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారిని చీఫ్ కమిషనర్ పోస్టులో ఎందుకు నియమించాలనుకుంటున్నారనేది చర్చగా మారింది. ఇద్దరు ఐఏఎస్ లు గత ప్రభుత్వంలో కూడా కీలక పదవుల్లో పనిచేసిన వారే కావడం విశేషం. స్వామిభక్తిని నిరూపించుకునేందుకు సీఎం చంద్రబాబుకు తెలియకుండా పావులు కదుపుతున్నారా? అనే అంశంపై కూడా అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒక వేళ ముఖ్యమంత్రికి తెలిసే ఈ వ్యవహారం సాగుతుంటే ఇందులో నైతికత పరిస్థితి ఏమిటి? రాజకీయంగా సాగుతోందా అనే చర్చ కూడా ఉంది.
గవర్నర్ కు ఆర్ఎం బాషా ఏమని లేఖ రాశారు
ఆర్ఎం బాషా పదవీ విరమణ చేయడానికి 20 రోజుల ముందు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖను సెప్టెంబరు 4న స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి అందజేశారు. ఈ లేఖ సారాంశం ఏమిటంటే... ఏపి సమాచార హక్కు కమిషన్ (సమాచార హక్కు చట్టం – 2025) నిబంధనల ప్రకారం చీఫ్ కమిషనర్ పదవీ కాలం పూర్తయిన తరువాత కొత్తగా నోటిఫికేషన్ ద్వారా వేరే వారిని నియమించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న కమిషనర్ లను ఇన్ చార్జ్ లుగా నియమించ కూడదు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సిక్రీలు కోర్టు విధుల్లో ఉన్నప్పుడు 2018లో ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని కూడా ఈ లేఖకు జోడించి ఇచ్చారు. లేఖను అందిస్తూ మీరు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పు కాపీ సర్ అంటూ గవర్నర్ కు చూపి చదివి వినిపించారు బాషా. అర్జీని పూర్తిగా పరిశీలించిన గవర్నర్ మీ లేఖను జత చేస్తూ తాను ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పి తరువాత ప్రభుత్వానికి చీఫ్ కమిషనర్, ఇతర కమిషనర్ల పోస్టుల భర్తీ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి లేఖ ప్రభుత్వానికి పంపించారు.
గవర్నర్ రాసిన లేఖ ఏమైంది?
సమాచార హక్కు చీఫ్ కమిషనర్, కమిషనర్ ల నియామకం విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి గవర్నర్ ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రభుత్వంలో ఎక్కడో ఆగిపోయింది. ఎవరు ఆ లేఖను తొక్కిపెట్టారో ప్రభుత్వ పెద్దలకు తెలిసినట్లు లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రధాన కీ పోస్టుల్లో ఉన్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల వద్ద ఆ లేఖ ఆగిపోయిందని, వారే ప్రస్తుతం సమాచార హక్కు కమిషన్ లో విధుల్లో ఉన్న కమిషనర్ సామ్యుల్ జోనాథన్ ను ఇన్ చార్జ్ కమిషనర్ గా నియమించేందుకు కావాల్సిన ఫైల్ ను రెడీ చేశారనేది విశ్వసనీయ సమాచారం. అందువల్ల గవర్నర్ లేఖ సీఎం వద్దకు వెళ్లలేదనే చర్చ కూడా జరుగుతోంది.
చట్ట విరుద్ధంగా ఎలా చేస్తారు?
సమాచార హక్కు చట్టం కమిషనర్ లుగా ఉన్న వారిని చీఫ్ కమిషనర్ పోస్టులో ఇన్ చార్జిగా నియమించ కూడాదని సుప్రీ కోర్టు తీర్పు ఉంది. పైగా ఆ తీర్పు ప్రస్తుతం ఏపీ గవర్నర్ గా ఉన్న అబ్దల్ నజీర్ గారు ఇచ్చింది. అయినా ఆ తీర్పును పక్కన పెట్టేశారు. గవర్నర్ గారు ప్రభుత్వానికి రాసిన లేఖను తొక్కిపెట్టారు. అంటే చట్టాలపై ఈ ఐఏఎస్ లకు కనీస గౌరవం లేకుండా పోయింది. పైగా గవర్నర్ లేఖకు కనీసపు విలువ ఇవ్వలేదు. అయినా పాలకులు, ప్రధానంగా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఏమి జరుగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనే చర్చ అధికార పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. అయితే బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ సాహసించడం లేదు.
వైఎస్సార్సీపీ అనుకూలుడైన జొనాథన్ ను ఎందుకు ఎంచుకున్నట్లు?
జొనాథన్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన శాయశక్తుల పనిచేసిన వారు. ఎన్నికల్లో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు పనికట్టుకుని పాస్టర్లను తోడేసుకుని ఎన్నికల ప్రచారం చేశారు. అందుకే నాటి ప్రభుత్వం జొనాథన్ ను సమాచార హక్కు కమిషనర్ గా పదవి ఇచ్చి గౌరవించింది. ఆయన పదవీ కాలం పూర్తి కాగానే బయటకు వెళ్లాల్సిందే. అయితే ఈలోపులోనే ఆర్ఎం బాషా వయసు రిత్యా 65 సంవత్సరాలు నిండటంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది జొనాథన్ కు లడ్డులా దొరికినట్లైంది. ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారుల అండ ఉండటంతో ఎలాగైనా చీఫ్ కమిషనర్ పదవిలో ఉండాలని పావులు కదిపారు. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం, దాని మిత్ర పక్ష పార్టీలు పట్టం కట్టబోతున్నాయి. ఇదెంత వరకు సరైందనే చర్చ తెలుగుదేశం పార్టీలోని ముఖ్య కార్యకర్తలు, నాయకుల్లో సాగుతోంది.
ఏడాది క్రితం సమాచార కమిషనర్లపై ప్రభుత్వానికి ఫిర్యాదు
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ ఆర్ఎం బాషా ప్రస్తుతం పదవుల్లో ఉన్న కొందరు కమిషనర్ ల తీరును తప్పు పడుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్యాలయానికి రాకుండా, హాజరు వేయకుండా ఎప్పుడో వారికి తీరిక ఉన్నప్పుడు ఆఫీసుకు రావడం, ఏదైనా ఫైల్ పై కోర్టు ఉందని, తప్పకుండా రావాలనే ఫోన్ కాల్స్ వెళితే తప్ప ఆఫీసుకు రాని వారు, అవినీతికి పాల్పడుతున్న వారిపై ఆధారాలతో కూడిన ఫిర్యాదును ఆర్ఎం బాషా చేశారు. అయితే ఆ విషయంలో అడుగు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ వారిని స్వాగతిస్తూనే ఉంది. ప్రస్తుతం బాషా రాసిన ఆ లేఖ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖలో అలాగే ఉంది.