బీహార్‌లో బీజేపీ అగ్రవర్ణాలనే నమ్ముకుందా?

బలహీన వర్గాల్లో ఐక్యత కంటే బలమైన ఐక్యతను చాటుకుంటున్న ‘సవర్ణలు’ -101 మంది పార్టీ అభ్యర్థుల్లో 49 మంది అగ్రవర్ణాలకు టిక్కెట్లు..

Update: 2025-10-17 08:01 GMT
Click the Play button to listen to article

భారతీయ జనతా పార్టీ (BJP) నిలబెట్టిన 101 మంది అభ్యర్థులలో 50 శాతం మంది అగ్ర కులాలకు చెందిన వారే. హిందూత్వ ఎజెండాకు వారు విధేయులుగా ఉండడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. బీజేపీ మంగళవారం 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, బుధవారం 12 మందితో రెండో జాబితాను, బుధవారం రాత్రి 18 మందితో మూడో జాబితా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


జనాభాలో వారిదే ఆధిక్యం..

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల(Assembly Polls) నేపథ్యంలో 101 మంది అభ్యర్థుల్లో 49 మంది అగ్రవర్ణాలకు చెందినవారు. 2023 రాష్ట్ర కుల జనాభా లెక్కల ప్రకారం.. అగ్రవర్ణాలు లేదా సవర్ణాలు 10.57 శాతం ఉన్నారు. వీరితో భూమిహార్లు (2.86 శాతం), బ్రాహ్మణులు (3.66 శాతం), రాజ్‌పుత్‌లు (3.45 శాతం) కాయస్థులు (0.60 శాతం) ఉన్నారు. 49 మంది అగ్రవర్ణ అభ్యర్థుల్లో 21 మంది శక్తివంతమైన రాజ్‌పుత్ వర్గానికి చెందినవారు. 16 మంది భూస్వామ్య భూమిహార్ వంశానికి, 11 మంది బ్రాహ్మణ వర్గానికి చెందినవారు, ఒకరు కాయస్థ వర్గానికి చెందినవారు.

అగ్రవర్ణ అభ్యర్థుల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు యువ జానపద గాయని మైత్లీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా. మిగతా వారంతా రాజకీయ నాయకులే.


సామాజిక న్యాయం కొరవడిందా?

అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్ కుల జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో OBCలు 27.1 శాతం, EBCలు 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాలు లేదా దళితులు 19.6 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఆదివాసులు) 1.68 శాతం ఉన్నారు.

సామాజిక సమానత్వంపై బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా.. బీహార్ జనాభాలో దాదాపు 85 శాతం ఉన్న ఓబీసీలు, ఈబీసీలు, దళితులు, ఆదివాసీలు (గిరిజనులు) 50 శాతానికే పరిమితమయ్యారు. అగ్రవర్ణ, మైనారిటీలకు ఎక్కువ సీట్లు దక్కాయి. దిగువ కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్న అగ్ర నాయకులు మాటలు నినాదాలకే పరిమితమయ్యాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

"జిస్కీ జిత్ని సంఖ్యా భారీ, ఉస్కీ ఉత్ని భాగీదారి" (సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, భాగస్వామ్యం అంత ఎక్కువగా ఉంటుంది) లేదా "జిత్ని అబాది, ఉత్ని హిస్సేదారి" (జనాభా ఎంత ఎక్కువగా ఉంటే, వాటా అంత ఎక్కువగా ఉంటుంది) అని గతంలో బీజేపీ నాయకులు హామీలు గుప్పించారు. కానీ వారి వాగ్దానాలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లో కనిపించే బలహీనమైన ఐక్యతతో పోలిస్తే.. సవర్ణాలు బలంగా ఉండటం వల్ల అగ్రవర్ణాలను సంతృప్తి పరచడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకుడు సత్యనారాయణ మదన్ అభిప్రాయపడ్డారు.

బీహార్‌లో కుల రాజకీయాలను ముందుండి నడిపిస్తున్న వర్గాలు రాజ్‌పుత్‌లు, భూమిహార్‌లు. వారికి భూములు, వ్యాపారాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతంలో వారి ఆధిపత్యం ఎక్కువ. అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియాలోనూ బలమైన పట్టుంది.


జాబితాలో యాదవులు తక్కువ.. ముస్లింలు లేరు

ప్రతిపక్షాలకు విధేయులైన కులాలకు బీజేపీ తక్కువ ప్రాతినిధ్యం కల్పించిందని వాదన కూడా వినిపిస్తుంది. జనాభాలో 14.26 శాతం ఉన్న యాదవ సామాజిక వర్గం నుంచి నలుగురు అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసింది.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు విధేయులుగా ఉన్న యాదవులను ఎదుర్కోడానికి అగ్రవర్ణాలే సరిజోడు అని బీజేపీ భావిస్తోంది. యాదవుల మాదిరిగానే, అధిక సంఖ్యలో ముస్లింలు కూడా ఆర్జేడీకి మద్దతు ఇస్తున్నారు.

బీహార్‌లో కుల ఆధారిత రాజకీయాల్లో.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెనక ఆయన సామాజిక వర్గానికి (కుర్మీ) చెందిన వారు ఉన్నారని BJPకి బాగా తెలుసు. కోయెరీలు లేదా కుష్వాహాలుగా విభజించబడ్డ EBC కమ్యూనిటీలో..ఎక్కువ మంది నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది RJDకి మద్దతు ఇస్తున్నారు. మొత్తం జనాభాలో 17 శాతం ఉన్న ముస్లిం సమాజం నుంచి కాషాయ పార్టీ ఏ అభ్యర్థినీ ఎంపిక చేయలేదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..బనియా కులం నుంచి బీజేపీ నలుగురు అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేసింది. వీరి జనాభాలో 2.31 శాతంగా ఉన్నారు. అగ్ర కులాల కంటే పార్టీకి వీరు వీర విధేయులు.


1990 నుంచి అదే ధోరణి..

బీజేపీ అగ్రవర్ణాలపై ఆధారపడటం కొత్త ధోరణి కాదు. 1990 ప్రారంభం నుంచి ఇది కనిపిస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో వారు కూడా పార్టీకి మద్దతు ఇచ్చారు.

"ఉన్నత కులాల వారు బీజేపీకి ప్రధాన మద్దతుదారులు. నమ్మకమయిన ఓటర్లు కూడా. పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. విస్మరించదు. ఒకప్పుడు అగ్ర కులాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేవి. కానీ పార్టీ బలహీనపడి అధికారం కోల్పోవడం చూసి బీజేపీ వైపు మళ్లారు.’’ అని రాష్ట్రంలో సామాజిక-రాజకీయ ధోరణిని నిశితంగా గమనిస్తున్న సామాజిక శాస్త్రవేత్త డీఎం దివాకర్ అన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికలలో కూడా 110 సీట్లలో 51 స్థానాల్లో అగ్రవర్ణ అభ్యర్థులనే నిలబెట్టింది. అదేవిధంగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 157 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఆ పార్టీ 65 మంది అగ్రవర్ణ అభ్యర్థులు ఉన్నారు.

మొత్తంమీద 1990 నుంచి కాషాయ పార్టీకి మద్దతు ఇచ్చిన నేర చరిత్ర ఉన్నవారితో సహా, బాహుబలిలు (రాజకీయ బలవంతులు) మరియు రాజకీయ నాయకులు చాలా మంది అగ్ర కులాలకు చెందినవారని మరియు ఎన్నికలలో బిజెపికి అనుకూలంగా తూకాలు వేయడంలో గణనీయమైన పాత్ర పోషించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే.. మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో వివిధ పార్టీల నుంచి ఎన్నికైన 12 మంది ఎంపీలు సవర్ణ (హిందూ) సమాజానికి చెందినవారు. 2019 లోక్‌సభ ఎన్నికలలోనూ బీహార్‌లోని వివిధ పార్టీల నుంచి అగ్ర కులాలకు చెందిన ఎన్నికయిన ఎంపీలు 13 మంది.

మొత్తం 243 స్థానాలకు గాను NDA కూటమిలోని BJP, JD(U) చెరో 101 స్థానాల్లో పోటీ చేయనుండగా, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని LJP (RV) 29 స్థానాల్లో, RLM, HAM(S) చెరో ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

Tags:    

Similar News