ఇస్రో కౌంట్‌డౌన్ ప్రారంభం

శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి ముహూర్తం ఖరారు. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి రాకెట్‌ ప్రయోగం..;

Update: 2025-01-28 10:10 GMT

భారత అంతరిక్ష పరిశోధనసంస్థ (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట(Sriharikota)లోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (SHAR) నుంచి ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్‌–2 ఉప గ్రహాన్ని రోదశిలోకి పంపనుంది. శ్రీహరికోట నుంచి ఇది ఇస్రో వందో ప్రయోగం. సుమా­రు 2,500 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా రోదసిలోకి పంపించనుంది.

ఈ నావిక్‌–2 అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గతంలో ఈ టెక్నాలజీ కోసం రష్యా మీద ఆధారపడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు భారత్ స్వయంగా ఈ టెక్నాలజీని తయారు చేస్తే స్థాయికి ఎదిగింది. ఇది జనవరి 13న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్‌కు మొదటి మిషన్ కూడా కావడం విశేషం.

ఇస్రో చ‌రిత్రను పరిశీలిస్తే..

భారత అంతరిక్షపరిశోధనా సంస్థ స్థాపించి 59 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. 1961లో డాక్టర్‌ హోమీ జహంగీర్‌ బాబా అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చిగా ఆవిర్భవించింది. ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (టీఈఆర్‌ఎల్‌ఎస్‌)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్‌ 21న ‘నైక్‌ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్‌ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్‌ 20న రోహిణి–75 అనే సౌండింగ్‌ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. దేశానికి మంచి రాకెట్‌ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్‌ విక్రమ్‌ సారాబాయ్, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్‌ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట అనువుగా కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు.   

Tags:    

Similar News