భారత రాజ్యాంగమే సుప్రీం:సీజేఐ గవాయ్‌..

సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకమైన చైత్యభూమి సందర్శించి నివాళి అర్పించారు.;

Update: 2025-05-18 14:59 GMT

న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్న తమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (Gavai) అన్నారు. ఇటీవల ఆయన 52వ CJIగా ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ గవాయ్‌.. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించారు. ముందుగా బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకమైన చైత్యభూమి సందర్శించి నివాళి అర్పించి సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది వైపు అడుగులు వేస్తున్న తరుణంలో తాను CJI కావడం సంతోషంగా ఉందన్నారు. దేశం బలోపేతం కావడమే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాలలో కూడా అభివృద్ధి చెందడం హర్షనీయమన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని "బుల్డోజర్ న్యాయం"కు వ్యతిరేకంగా తన తీర్పును ప్రస్తావిస్తూ.."ఆశ్రయం పొందడం పౌరుడి ప్రాథమిక హక్కు. నేరానికి పాల్పడినా, దోషిగా తేలిన వ్యక్తి ఇంటికి కూల్చకూడదు. న్యాయ నియమాలను పాటించాలి" అని సూచించారు.

తన ప్రసంగంలో కొన్ని తీర్పులలో ఉదహరించిన ప్రధాన న్యాయమూర్తి.. కార్యక్రమం చివర్లో తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తులు అభయ్ ఓకా, దీపాంకర్ దత్తా, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే కూడా హాజరయ్యారు. నవంబర్‌లో గవై పదవీ విరమణ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సిజెఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Tags:    

Similar News