బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం

వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.;

Update: 2025-05-14 06:54 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్సీ బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దుగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని పురందేశ్వరి అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని జకియా ఖానం అన్నారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని, ముస్లిం మైనారిటీలకు నుంచి మోదీకి మంచి సందేశమచేందుకే తాను బీజేపీలో చేరినట్లు జకియా ఖానం వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అయిన జకియా ఖానం బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. జకియా ఖానం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవతితో పాటు మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవికి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జకియా ఖానం రాజీనామా చేశారు. ఆ మేరకు తన రాజీనామా లేఖను మండలి చైర్మన్‌కు పంపారు.
అయితే ఎందుకు రాజీనామా చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షంలో ఉన్న టీడీపీ ఒత్తిడి, స్థానిక రాజకీయాల వల్లే ఆమె రాజీనామా చేసి ఉంటారనే చర్చ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అంతేకాకుండా గత రెండేళ్లుగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఆ కారణం చేతనే ఆమో రాజీనామా చేశారనే మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. జకియా ఖానం ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన వారు. జకియా ఖానంను 2020 జులైలో గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయబడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జియా ఖానంకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూడా నియమించి మరో గౌరవాన్ని కల్పించారు.
2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
Tags:    

Similar News