టీటీడీ తొక్కిసలాటపై వైఎస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం
తిరుమల లడ్డూ కేసు మాదిరిగానే దీనిని కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ఆ పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు.;
తిరుమల తిరుపతి తొక్కిసలాట ఘటన మీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి దిగాలనే ఆలోచనలకు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలా? లేదా నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించాలా అనే దానిపైన ఆ పార్టీ పెద్దలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఇది దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి.. దీనిని నేషనల్ ఇష్యూ చేయాలని.. టీటీడీ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించడమే మంచిదనే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కూడా ఇది వరకు ఆ పార్టీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ రాజ్య సభ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సిట్ కూటమి ప్రభుత్వం జేబులోని సంస్థని, దీని వల్ల సమగ్రమైన విచారణ జరిగే అవకాశం ఉండదని, ఏక పక్షంగా సాగే అవకాశం ఉంటుందని.. అందువల్ల దీనిని రద్దు చేయాలని కూడా పిటీషన్‌లో వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు లడ్డూ వ్యవహారంపై వేసిన సిట్‌ను రద్దు చేస్తూ ఆ బాధ్యత నుంచి సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పించింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో తమకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో, తొక్కిసలాట ఘటన కూడా భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి అనుకూలంగానే స్పందించేందుకు అవకాశం ఉంటుందని, దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తేనే మంచిదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.