నీ కొడుకు అమరుడంటూ.. తల్లడిల్లిన మంత్రి సవితమ్మ

వీరమరణం పొందిన జవాన్ కుటుంబానికి మంత్రి రూ. 5 లక్షలు సాయం అందించారు. నాయక్ కుటుంబంతో సీఎం కూడా మాట్లాడారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-09 10:18 GMT

కాశ్మీర్ లో వీరమరణం చెందిన మురళీనాయక్ కుటుంబాన్ని మంత్రి సవితమ్మ ఓదార్చారు. శుక్రవారం మధ్యాహ్నం తాండాకు వెళ్లిన ఆమె నాయక్ కుటుంబానికి ఐదు లక్షలు సాయం అందించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ అసెంబ్లీ స్థానం గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ కళ్లి తాండాకు చెందిన మురళీనాయక్ గురువారం రాత్రి పాక్ తూటాలకు గాయపడి, ఆ తరువాత తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో మంత్రి ఎస్. సవితమ్మ శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గ్రామంలో నాయక్ తల్లిదండ్రులను ఓదార్చడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి ఎస్. సవితమ్మ కన్నీటిపర్యంతం అయ్యారు.

ఓ వీరుడికి నీవు తల్లివి. మేమంతా మీ కుటుంబానికి అండగా ఉన్నాం అని సముదాయించారు. మురళీనాయక్ పార్ధివదేహం శనివారం గ్రామానికి చేరుతుందని, అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
రూ. 5 లక్షల ఆర్థికసాయం
యుద్ధభూమిలో ప్రాణాలు వదిలిన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ ను మంత్రి సవితమ్మ ఓదార్చడానికి విఫలయత్నం చేశారు. జ్యోతిబాయికి మంచినీరు తాగించిన మంత్రి సముదాయించారు.
"నీవు వీరుడిని గన్న తల్లివి. దేశం మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుంది" అని మురళీనాయక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం మురళీనాయక్ తల్లిదండ్రులకు మంత్రి ఎస్. సవితమ్మ వ్యక్తిగతంగా రూ. ఐదు లక్షల చెక్కు అందించారు.
"దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే. మీకు నేను, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది" అని ధైర్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం ఎన్. చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా సాయం అందుతుంది. భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి అండగా నిలబడతా అని మంత్రి సవితమ్మ మురళీనాయక్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

సీఎం చంద్రబాబు పరామర్శ

ధైర్యంగా ఉండండి తల్లీ...
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ఎన్. చంద్రబాబు కూడా మురళీ నాయక్ తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. నాయక్ ఇంటి నుంచే సీఎం చంద్రబాబుకు కాల్ చేసి, మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబ స్థితిని మంత్రి స్వయంగా సీఎం చంద్రబాబుకు వివరించారు. వీరికి మురళీనాయక్ ఒక్కడే కొడుకు అని తెలిపారు. అనంతరం మురళీనాయక్ తల్లిదండ్రులతో సీఎం ఫోన్ లో మాట్లాడారు.
"మీ కుటుంబం దేశానికి చేసిన సేవ చాలా గొప్పది తల్లీ. అధైర్య పడొద్దు. మీకు నేను, ప్రభుత్వం అండగా ఉంటాం" అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మీ కుటుంబ బాధ్యత తీసుకుంటాం. అవసరమైన సాయం అందిస్తాం" అని సీఎం చంద్రబాబు వారిని ఓదార్చారు.
రేపు అంత్యక్రియలు
వీరమరణం చెందిన మురళీనాయక్ పార్ధివదేహం శనివారం మధ్యాహ్నం గ్రామానికి చేరుతుందని మంత్రి సవితమ్మ చెప్పారు. అధికార లాంఛనాలతో ఆ వీరుడుకి అంతిమవీడ్కోలు పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పిన మంత్రి సవితమ్మ, నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తోపాటు కేంద్రం నుంచి కూడా సాయం అందిస్తామని వెల్లడించారు.

Similar News