ఆ గూడెంకు కరెంటొచ్చింది

పవన్ కల్యాణ్ చొరవతో అల్లూరి జిల్లాలోని గిరిజన గూడెంలో తొలిసారి విద్యుత్ కాంతులను కళ్ల చూశారు.

Update: 2025-11-05 16:41 GMT

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామంలో స్వాతంత్య్రం తర్వాత తొలిసారి విద్యుత్ వెలుగులు వచ్చాయి. ప్రపంచానికి దూరంగా, అడవుల్లో ఉన్న ఈ గిరిజన శిఖర గ్రామంలో 17 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గ్రామస్తులు దీర్ఘకాలం బాధపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఐదు నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చింది. బుధవారం 17 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున వెన్నెల కాంతులతో పాటు గూడెం ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపారు. 

గూడెం గ్రామస్తులు పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వెళ్లి, రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ, అడవి జంతువుల భయంతో గడిపేవారు. గతంలో అధికారులకు వారి సమస్యలు చెప్పినా పరిష్కారం లభించలేదు. ఐదు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వారి వినతి చేరింది.  గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపాలని, గూడెం గ్రామంలో విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ వినతిని పవన్ కళ్యాణ్ తక్షణమే పరిగణనలోకి తీసుకుని, అల్లూరి జిల్లా కలెక్టర్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో లైన్లు వేయాలని ఆదేశించారు. అయితే దీనికి రూ.80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

పవన్ కళ్యాణ్ ఈ సమస్యను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు, ఏపీ జెన్‌కో సీఎండీలకు తెలియచేసి, కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకోవాలని సూచించారు. భారత ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా కేంద్ర నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సహకారంతో పనులు చేపట్టారు. 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, 17 ఇళ్లకు సరఫరా చేశారు. ప్రత్యామ్నాయంగా సోలార్ ప్యానెళ్లు, ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌లు కూడా ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 15 రోజుల్లో పూర్తి చేశారు. 

కేంద్ర ప్రభుత్వం గిరిజన శిఖర ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు నింపేందుకు నిధులు కేటాయించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోందని, గూడెం గ్రామంలో విద్యుత్ సరఫరా దీనికి నిదర్శనమని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఏపీసీపీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వి తేజ, విద్యుత్ శాఖ సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. కనీస సౌకర్యాలు లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం ఆనందం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పవన్ కళ్యాణ్ చొరవతో తమ గ్రామంలో వెలుగులు నింపారని ధన్యవాదాలు తెలిపారు. 

Tags:    

Similar News