కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

పూతలపట్టులో వైసీపీకి మరో కీలక నేత, సిట్టింట్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Update: 2024-04-06 10:53 GMT


ఆంధ్రలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న క్రమంలో వైసీపీకి మాత్రం వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రతి ఒక్కరిదీ దాదాపు రెండే కారణాలు.. అవే ప్రాధాన్యత లోపం, టికెట్ దక్కకపోవడం. తాజాగా వైసీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంఎస్ బాబుది కూడా ఇదే కథ. గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆయనకు ఈసారి ఎన్నికల్లో వైసీపీ అవకాశం ఇవ్వలేదు. దీంతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ మారాలని నిశ్చయించుకున్నారు. అదే విధంగా వైసీపీకి వీడ్కోలు చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పూతలపట్టులో జరుగుతున్న ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కండువా కప్పి షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు.


పూతలపట్టు టికెట్ బాబుదే


అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో ఇప్పుడు ఎంఎస్ బాబు.. పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఈ టికెట్ ఆయనకే దక్కుతుందని అనుచర వర్గాలు భావిస్తున్నాయి. ఆ మేరకు చర్చలు చేసిన తర్వాతనే ఆయన పార్టీ మారారని కూడా ఒక వర్గం అభిప్రాయపడుతోంది. మరి ఆయన ఆశించినట్లుగా టికెట్ లభిస్తుందా లేదంగా కాంగ్రెస్‌లో కూడా భంగపాటు తప్పదా అనేది చూడాలి.



Tags:    

Similar News