ఏపీలో ఎలక్ట్రిక్ బస్ ప్లాంట్
హిందుజా గ్రూప్‌తో రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు లండన్‌లో హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఈ సమావేశంలో దశలవారీగా రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో ఉన్న హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగావాట్లకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేస్తామని హిందుజా గ్రూప్ ప్రకటించింది. అంతేకాకుండా, కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌ను స్థాపిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని హిందుజా నేతలు అంగీకరించారు.
అనంతరం, ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జరాల్డ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై, పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమరావతి, విశాఖపట్నంలో నూతన టెక్నాలజీల ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ భేటీలు ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడానికి కీలకమవుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ఈ దిగ్గజాలను ఆహ్వానించారు.