భక్తుల భద్రతపై దృష్టి పెట్టండి

కార్తీక మాసం రద్దీకి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Update: 2025-11-03 16:14 GMT

కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం సహా పలు ప్రధాన క్షేత్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు.

కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఉన్న ఆలయాల జాబితా సిద్ధం చేసి కలెక్టర్, ఎస్పీలకు అందించాలని ఆదేశించారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, శని, ఆది, సోమవారాల్లో రద్దీ ఊహించని విధంగా పెరుగుతుందని అంచనా వేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు నిర్వహించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని తెలిపారు. రద్దీకి తగినట్టు ఆర్టీసీ బస్సులు నడపాలని, జాతీయ రహదారులపై వాహన రాకపోకలు క్రమబద్ధీకరించి ప్రమాదాలు నివారించాలని సూచించారు. రద్దీ రోజుల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News